నేను ఏ విదమైన ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్‌ను ప్రమోట్ చేయడంలేదు. కేవలం ఈ మెడిసిన్ ద్వారా నేను, మానాన్న గారు, మా మేనేజర్ కోవిడ్-19 నుండి ఎలా కోలుకున్నామో మీ అందరికీ చెప్పాలన్నదే నా కోరిక అని అన్నారు ప్రముఖ హీరో విశాల్. ఇటీవల విశాల్ వారి తండ్రి జి.కె.రెడ్డి కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే..ఈ సందర్భంగా విశాల్ ఒక వీడియో విడుదల చేశారు..
విశాల్ మాట్లాడుతూ – “నాన్న గారికి జూన్‌లో కరోనా పాజిటీవ్ వచ్చిందని ఈ మధ్య కాలంలో ఒక వీడియో పెట్టాను. మా నాన్న గారికి 82 సంవత్సరాలు. ఈ వయసుతో ఆయనను హాస్పటల్లో అడ్మిట్చేయాలనే ఆలోచన అస్సలు లేదు. ఇంట్లోనే ఉంచి ఆయనను బాగా చూసుకోవాలనేదే నా కోరిక. అందుకే నేనే దగ్గరుండి ఆయనను చూసుకున్నాను. ఆ క్రమంలో నాకు అవే లక్షణాలు కనిపించాయి. దాంతో టెస్ట్ చేయించుకుంటే నాకు కరోనా పాజిటీవ్ అని తేలింది. నాతో పాటు నాకు దగ్గరగా ఉండే మా మేనేజర్ కి కూడా పాజిటీవ్ వచ్చింది. మా అంకుల్ డాక్టర్ హరిశంకర్
గారి సమక్షంలో మేము ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్ తీసుకున్నాం. దీనికి ముందు మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ కోవిడ్ సమయంలో అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వేసుకునే మందులకంటే ముందు మనలో భయం ఉండకూడదు. ఆ భయం చాలా అనర్ధాలకు దారి తీస్తుంది. అందుకనే ముందు దైర్యంగా ఉండండి. మనం తప్పకుండా ఈ వైరస్‌ని ఎదుర్కోగలం మనం మనసులో తలుచుకోండి. ఈ ధైర్యం మా నాన్నగారి నుండి నాకు వచ్చింది. అలాగే నా నుండి మా మేనేజర్ కి వచ్చింది. ఆ దైర్యమే మమ్మల్ని మూడు వారాల్లో పూర్తిగా కోలుకునేలా చేసింది. అలాగే మా డాక్టర్ ఇచ్చిన మందులు కూడా మాకు హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా 82 సంవత్సరాలున్న నాన్న గారికి చాలా హెల్ప్ అయింది. ఈ సందర్భంగా మా అంకుల్ డాక్టర్ హరి శంకర్ గారికి దన్యవాదాలు తెలుపుతున్నాను.
మన జీవితంలో ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు చూస్తాం. ఇదీ అలాంటి ఒక ఎక్స్పీరియన్స్. ఒక సినిమా ప్రారంభంలో సామాజికసృహతో ఎన్నో వీడియోలు వేస్తాం అలానే ఈ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను తప్ప నేను డాక్టర్స్, హాస్పిటల్స్, మెడిసిన్ వ్యవస్థకి వ్యతిరేకం అని కాదు. మాకు ఏ మెడిసిన్ ఉపయోగపడిందో ఆ వివరాలు నా ట్విట్టర్ అకౌంట్లో ఉంచడం జరిగింది. అందరూ దైర్యంగా ఉండండి తప్పకుండా మనం ఈ కరోనాను జయించగలం“ అన్నారు.