ఘనంగా జరిగిన ‘ఆర్య’ 20 ఏళ్ల వేడుక – ఆర్య సినిమా తన జీవితాన్నే మార్చేసింది అంటున్న బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్య’. సుకుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2004 మే 7న ఈ మూవీ రిలీజైంది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా విడుదలై 20 ఏళ్లు అయ్యింది. ఈ స్పెషల్ మూమెంట్స్‌ను ఇప్పుడు చిత్ర యూనిట్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, శివ బాలాజీ, సుబ్బరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే సినిమాలు తక్కువగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఆర్య ఒకటి. అలాంటి సినిమాను మాకు అందించిన దిల్‌రాజుగారికి మనస్ఫూర్తిగా థాంక్స్. ఎందుకంటే ఆర్య సినిమా మాత్రమే కాదు.. మా అందరికీ మరచిపోలేని జ్ఞాపకం. వన్ సైడ్ లవ్‌ కాన్సెప్ట్ ఏ ముహూర్తాన సుకుమార్ గారు పరిచయం చేశారో తెలియదు, కానీ ప్రపంచమంతా మమ్మల్ని ప్రేమించింది. బన్ని మీద నాకు ఫ్రెండ్లీ లవ్ ఉంటుంది. మా ఫ్యామిలీస్‌తో ఉన్న ప్రేమ, అభిమానం కూడా దానికి కారణం కావచ్చు. మేం ఏం చేసినా ప్రతి దాన్ని కడిగిన ముత్యంలా చూపించారు. ఇప్పటికీ సినిమా చూసినా ఇప్పుడే షూట్ చేసినట్లు ఉంటుంది. బన్ని ఆర్యతో ట్రెండ్ క్రియేట్ చేశారు. ప్రతి సినిమాకు తనను తాను అప్‌గ్రేడ్ చేసుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. ఈ సినిమాలో పని చేసిన మా నటీనటులకు, టెక్నీషియన్స్‌కు థాంక్స్’’ అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ఆర్య సినిమాతో ప్రారంభమైన అందరూ ఈ రోజు టాప్ పోజిషన్ లో ఉన్నారు. ఓ సినిమాతో ఇలాంటి మ్యాజిక్ జరగటం తెలుగులోనే కాదు, ఇండియన్ సినిమాలోనే తొలిసారి. టైటిల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జ్ఞాపకాలున్నాయి. దిల్ సినిమా జరుగుతుంది. అప్పుడే ఆర్య కథ చెప్పాడు సుకుమార్. అప్పుడే సినిమా చేస్తున్నామని నమ్మకంతో చెప్పేశాను. బన్ని మార్నింగ్ ఫస్ట్ హాఫ్ విన్నాడు.. సెకండాఫ్ మధ్యాహ్నం విన్నాడు. తర్వాత అరవింద్ గారు కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు. సుక్కు ఏమో చెప్పిన కథనే మళ్లీ చెప్పటం నా వల్ల కాదు.. నేను వెళ్లిపోతాను అన్నాడు. తర్వాత చర్చలు ఆగిపోయాయి. తర్వాత సత్యనారాయణరెడ్డిగారి వల్ల చర్చలు మొదలయ్యాయి. బన్ని, అరవింద్ గారు ఆపీసుకి వచ్చి కథ విన్నారు. అప్పుడు తను ప్రతి సీన్ రాసుకుంటూ విన్నారు. కథ పూర్తయ్యాక, అరవింద్ గారు లేచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా సినిమా మొదలైంది. తర్వాత నాకు, సుక్కుకి మధ్య ఫ్రెండ్లీ గొడవలు చాలానే జరిగాయి. ప్రతి ఒక మూమెంట్ యాడ్ అవుతూ ఆర్య సినిమా తయారైంది. బన్ని ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యారు. సినిమాలో రన్నింగ్ ట్రాక్ సీన్ ఉంటుందిగా, దానికి సంబంధిచిన కటౌట్ ని మేం అన్నపూర్ణలో ఓపెనింగ్ రోజు పెట్టాం. దాన్ని అల్లు రామలింగయ్యగారు అలా చూసుకుంటూ ఉండిపోయారు. ఆరోజు ఆయన ఏదో ఒకరోజు బన్ని ఇండస్ట్రీని ఏలుతారని అనుకుని ఉంటారు. అది ఈరోజు నిజమైంది. బన్ని ఈరోజు ఈస్థాయిలో ఉండటానికి తను పెట్టిన ఎఫర్ట్సే కారణం. బన్ని ఒక్కో మెట్టుని భయంతో, రెస్పాన్సిబిలిటీతో చేస్తూ వస్తున్నాడు. అందుకనే ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. బన్ని, సుక్కు కాంబినేషన్ లో చేసిన పుష్ప 1తో ఆల్ ఇండియా లెవల్లో సెన్సేషనల్ హిట్ కొట్టారు. ఇప్పుడు పుష్ప 2తో ప్రపంచమంతా వెయిట్ చేసేలా చేశారు. ఇద్దరికీ హ్యాట్సాఫ్. నిర్మాతగా 56 సినిమాలు చేశాను. అయితే ఆర్య సినిమాకు దొరికిన ఎంజాయ్ మెంట్ జర్నీ ఇంకెప్పుడూ దొరకలేదు. సినిమా ఆడుతున్నన్ని రోజులు ట్రిప్స్ తో ప్రేక్షకుల మధ్య ఎంజాయ్ చేశాం. ఆర్య సినిమా మా అందరి జీవితాలను టర్న్ చేసింది.. ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీని కాపాడుకుంటూ ముందుకెళ్లాలి’’ అన్నారు.

శివ బాలాజీ మాట్లాడుతూ ‘‘ఆర్య’ సినిమాలో ప్రతి సన్నివేశం నాకు ఒక మరచిపోలేని మెమొరీ. మూవీ ఓపెనింగ్ రోజున అన్నపూర్ణ స్టూడియో దగ్గర అల్లు రామలింగయ్య కూర్చుని అందరినీ గమనిస్తూ ఉండటాన్ని నేను మరచిపోలేను. తర్వాత చిరంజీవిగారి క్లాప్‌తో సినిమా ప్రారంభమైంది. దర్శకుడు సుకుమార్ సహా అందరితో మంచి రిలేషన్ ఏర్పడింది. లైఫ్ లో నా మొదటి సక్సెస్ ఆర్య సినిమాతోనే వచ్చింది. తర్వాత అలాంటి సక్సెస్ మళ్లీ చూడలేదు. దిల్ రాజుగారు గురువుగారిలా నడిపించారు. సుకుమార్‌గారితో పని చేసిన ప్రతి క్షణాన్ని మరచిపోలేను. మంచి స్నేహితుడిగా భావిస్తుంటాను. దేవిశ్రీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. రత్నవేలుగారు మమ్మల్ని చాలా బాగా చూపించారు. బన్ని అప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు అలాగే ఉన్నాడు.. దేశమే కాదు.. పక్కనున్న దేశాలు కూడా నీ గురించి మాట్లాడుకుంటున్నాయి. 20 ఏళ్ల ఆర్య సెలబ్రేషన్స్ లో పాల్గొనటం చాలా హ్యాపీగా ఉంది. పుష్ప 2కి కంగ్రాట్స్’’ అన్నారు.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ‘‘ఆర్య స్క్రిప్ట్‌ని నేను, వేమ కలిసి రాశాం. ఇద్దరం ఎడిటర్ మోహన్ గారి దగ్గర రైటర్స్ గా వర్క్ చేస్తున్నాం. డైరెక్ట్ చేద్దామనే ఆలోచనతో మా ఫ్రెండ్ దగ్గర 10 వేలు అప్పు తీసుకుని బయటకు వచ్చేశాం. ఆర్య జర్నీ అలా స్టార్ట్ అయ్యింది. రాజుగారికి కథ చెప్పినప్పుడు దిల్ సినిమా హిట్ అయితే సినిమా చేద్దామని ఆయన అన్నారు. ఆయన రీమేక్ సినిమా చేద్దామని స్క్రిప్ట్ ఇచ్చినా నేను చేయనని అనేశాను. అప్పుడు ఆర్య సినిమా కథ స్టార్ట్ అయ్యింది. అలాంటి సమయంలో నా కథను నమ్మి, కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన వ్యక్తి దిల్ రాజుగారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. రాజుగారు అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ మూవీ ఉండేది కాదు. ఆర్య సినిమా రూపొందటానికి రెండో కారణం బన్ని. తనే కథను వదలకుండా కూర్చుని సినిమా చేసుకున్నాడు. రీల్ లైఫ్, రియల్ లైఫ్ లో నేను ఇలా నిలబడి ఉన్నానంటే బన్నీనే కారణం. అప్పుడు దేవిశ్రీప్రసాద్ ఓ సెన్సేషన్. ఫస్టాఫ్ కథ వినగానే ఫీల్ మై లవ్ సాంగ్ ట్యూన్ ఇచ్చేశాడు.  నాకు ఐటెం సాంగ్ చేయటం ఇష్టం లేదు. కానీ దేవిశ్రీతో చేయాల్సి వచ్చింది. ఆ పాట హిట్ అయిన తర్వాత ప్రతీ సినిమాలో ఐటెం సాంగ్ పెడుతున్నాను. నాకు సంబంధించినంత వరకు నా మ్యూజిక్ అంటే దేవిశ్రీప్రసాదే. శివ బాలాజీ.. రోల్ ఒప్పుకున్నందుకు థాంక్స్. బన్నీతో తన కాంబినేషన్ చక్కగా కుదిరింది. సుబ్బరాజ్ అయితే అప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు అలాగే ఉన్నాడు. రత్నవేలుగారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. చిరంజీవిగారిని కలిసి కథ చెప్పినప్పుడు 20 నిమిషాలే చెప్పాలన్నారు. కానీ నేను కథ చెబుతుంటే, మూడు గంటలు విన్నారు. సినిమా కథ చాలా బావుందని అన్నారు. సినిమా తీస్తే హిట్ అని కూడా అన్నారు. శిరీష్, లక్ష్మణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా జరిగి నిన్న, మొన్న అయినట్లు ఉంది. పేరు పేరునా అందరికీ థాంక్స్. ఈరోజు ఇక్కడి నిలబడి ఉన్నానంటే మీ ఆశీస్సులే కారణం’’ అన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆర్య’ ఈ ఏడాదికి 20 ఏళ్లు అవుతుందని రాజుగారు అన్నారు. అప్పుడు కచ్చితంగా సెలబ్రేట్ చేస్తామని నేను అన్నాను. ఆర్య సినిమా గురించి చెప్పాలంటే.. నా జీవితంలో అతి పెద్ద మరచిపోలేని క్షణం.. అది నా జీవితాన్ని మార్చేసిన సినిమా అని చెబుతాను. గంగోత్రి సినిమా హిట్ అయ్యింది.. కానీ నాకు పర్సనల్ గా గుర్తింపు రాలేదు. నా మార్క్ నేను క్రియేట్ చేయలేకపోయాను. ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నాను. రోజుకు మూడు కథలు వినేవాడిని. సినిమాలు చూస్తుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను. కథ వింటున్నాను కానీ, మ్యాజిక్ ఎక్కడా తగలటం లేదు. అప్పుడు హీరో తరుణ్ నాకు మంచి ఫ్రెండ్. తను నాకు ఫోన్ చేసి ఇలా రాజుగారు నాకోసం దిల్ సినిమా వేస్తున్నారు. నేను చూడటానికి వెళుతున్నాను. నువ్వు కూడా వస్తావా అన్నారు. నేను ఆల్ రెడీ సినిమాను రెండు సార్లు చూశాను. నాకు సినిమా నచ్చింది. అయినా వస్తానని ప్రసాద్ ల్యాబ్ కి వెళ్లాను. అక్కడ సుకుమార్ గారు నన్ను కలిశారు. కథ చెబుతానన్నారు..చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్ గా కథ నచ్చింది. ఇడియట్ సినిమాలాంటి సినిమా చేయాలని కోరిక ఉండేది. సుకుమార్ గారు నాకు ఆర్య కథ చెబుతుంటే.. ఇదే నా ఇడియట్ సినిమా అనిపించింది. అందరం కొత్తవాళ్లం. చాలా స్ట్రగుల్స్ పడ్డాం. కథ చాలా బావుందని గట్టి నమ్మకముండేది. ఈ సందర్భంలో వినాయక్‌గారికి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే.. సుకుమార్ గారు సిినిమా చేయగలరా లేరా అనే ఆలోచన ఉండేది. అప్పుడు వినాయక్ గారు మా ఇంటికి వచ్చి మీరు  నన్ను నమ్మి సినిమా తీయండి.. ఆ కుర్రాడు సినిమా బాగా తీయగలడు అన్నారు.  ఆ మాట మాకెంతో బలమిచ్చింది. ఒకవేళ ఏదైనా సీన్ మీకు బాగోలేదనిపిస్తే నేను వచ్చి తీసిపెడతా అన్నారు. ఆరోజు ఆయన అలా చెప్పటం గొప్ప. ఈ సందర్భంగా వినాయక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. వారం రోజుల పాటు ట్రయల్ షూట్ చేశాం. సుకుమార్ గారు అత్యద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. ఇది సినిమా గ్రేట్ సెన్సేషన్ అవుతుందని అందరిలో నమ్మకం వచ్చేసింది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. మా అందరిలో అప్పుడు దేవిశ్రీనే స్టార్.  ఆర్య సినిమా జర్నీ గురించి మాటల్లో చెప్పలేను. ఈ సినిమాకు పని చేసిన అందరూ డైరెక్టర్స్ అయ్యారు. అందరం ఈ సినిమాకు కలిశామని కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన విషయం. తెలుగు సిినిమా ఇలా కాదు.. ఇలా కూడా ఉంటుందని చెప్పిన సినిమా ఆర్య. తొలి రోజున సినిమా 40 శాతం ఓపెనింగ్ మాత్రమే వచ్చింది. పది వారాల సినిమా అని టాక్ వచ్చింది. నేను, సుకుమార్ కాస్త డల్ అయ్యాం. తెలియని కోపం వచ్చేస్తుంది. ఈ స్టేజ్ లో పది వారాల టాక్ రావటం గొప్ప అని మా నాన్నగారు అంటే .. ఏంటి పది వారాలు.. 125 డేస్ మూవీ అది అని గట్టిగా అన్నాను. అది పిచ్చైనా అనుకోండి, ఇంకేమైనా అనుకోండి.. అలా అనేశాను. కానీ నిజంగానే చిరంజీవిగారి చేతుల మీదుగా 125 డేస్ షీల్డ్ తీసుకున్నాను. నా లైఫ్ జీరోతో స్టార్ట్ అయ్యింది. గంగోత్రి హిట్ అయినా నేను -100కి వెళ్లిపోయాను. అయితే ఆర్య సినిమాతో +100కి చేరిపోయాను. తర్వాత నా లైఫ్ లో ఎంత వచ్చినా అది అడిషన్ మాత్రమే. రాజుగారు ఈ సిినిమాకు డబ్బలు పెట్టి రిస్క్ చేసి మా అందరికీ లైఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు థాంక్స్ చెబుతున్నాను. రాజుగారు లేకపోతే ఆర్య సినిమా ఉండేది కాదు. నలబై ఏళ్ల తర్వాత కూడా నేను వెనక్కి తిరిగి చూసుకన్నప్పుడు నా లైఫ్ ను చేంజ్ చేసిన వ్యక్తి ఎవరంటే మరో ఆలోచన లేకుండా సుకుమార్ గారనే చెబుతాను. ఆయన వల్ల నా లైఫ్ మారిపోయింది. ట్రెయిన్ లాంటి వ్యక్తిని, ఎలా వెళ్లాలో తెలియదు.. ట్రాక్ లేదు.. అలాంటి సమయంలో ఆర్య లాంటి సినిమాతో నన్ను ట్రాక్ ఎక్కించిన వ్యక్తి సుకుమార్. ఆ సక్సెస్ లో దేవిశ్రీప్రసాద్ ఎంత కీలకమైన పాత్ర పోషించాడో చెప్పనక్కర్లేదు. ప్రతి పాటతో సినిమా నెక్ట్స్ లెవల్ కు దేవి తీసుకెళ్లిపోయాడు. ఇక రత్నవేలుగారు చెత్తలో కూడా కెమెరా పెట్టికూడా సీన్ ను అద్భుతంగా తీశారు. ఆర్ట్ అనేది డబ్బుకి సంబంధించింది కాదు.. అభిరుచికి సంబంధించిందని రత్నవేలుగారిని చూసి నేర్చుకున్నాను. అను మెహతా, బబ్లు, చిత్రంశ్రీను, సుబ్బరాజ్ సహా అందరికీ థాంక్స్. నేను ఈరోజు ఇలా నిల్చున్నానంటే కారణం ఆర్య సినిమానే. అక్కడ నుంచి మొదలైతే ఇప్పుడు పుష్ప వరకు వచ్చాం. ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశం రాదు..ఆర్య చేసిన 20 ఏళ్లకు,  ఆ సినిమాకు పని చేసిన సుకుమార్ గారు వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ ఇండియన్ డైరెక్టర్ అయ్యారు. దిల్ రాజు గొప్ప  సినిమాలను తీస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ టు బ్యాక్ టు ఆల్బమ్స్ తో ఎంటైర్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. రత్నవేలుగారు ఇండియాలో బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. నేను కూడా మీ అందరి సపోర్ట్ తో మంచి సినిమాలు చేస్తున్నాను. ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.