గోపీచంద్ ధైర్యం ఏమిటి? చాణక్య మూవీ స్క్రిప్ట్ లో అంత దమ్ముందా? సైరా మూవీకి పోటీగా మూడు రోజుల తేడాతో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? సహజంగా పెద్ద మూవీకి పోటీగా మరో చిత్రం విడుదల ఉండదు. ఈ మధ్య కాలంలో మూవీ రిలీజ్ లో పోటీ లేకుండా వాయిదాలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో నమ్మకం ఉంటే కానీ పెద్ద సినిమాకి పోటీ మూవీ ఉండదు. హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సాహసానికే రెడీ అయ్యాడు. దసరా పండక్కి అక్టోబరు 2న పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న చిరంజీవి ‘సైరా’ రిలీజ్ అవుతుంటే దానికి పోటీగా గోపీచంద్ ‘చాణక్య’ను అక్టోబరు 5న విడుదల చేస్తునారు. చిరు డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా’ రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో ఓ విజువల్ వండర్లా రూపొందగా ప్రేక్షకుల్లో దీనిపై భారీ అంచనాలున్నాయి.
సైరా సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తోందని ప్రకటన రాగానే టాలీవుడ్లోని మిగతా చిత్రాలన్నీ ఆగిపోయాయి. చాలా మూవీలు దసరా రేసు నుంచి తప్పుకున్నాయి కానీ గోపీచంద్ మాత్రం ‘సైరా’ విడుదలకు మూడు రోజుల వ్యవధిలో తన ‘చాణక్య’ను బిగ్ స్క్రీన్స్ పైకి తెస్తున్నారు. సైరా పీరియాడికల్ వార్ ఫిల్మ్ అయితే చాణక్య స్పై థ్రిల్లర్. జనర్స్ వేరు అయినా, స్కేల్ వేరు అయినా ఈ రెండు సినిమాలకి ఉన్న కామన్ పాయింట్ దేశభక్తి. చిరంజీవి సైరా దేశం కోసం బ్రిటిషర్లతో యుద్ధం చేస్తే గోపీచంద్ చాణక్య పాకిస్థాన్ టెర్రరిస్టులతో వార్ చేస్తున్నాడు. తమ సినిమాలో బలమైన కంటెంట్ ఉంది అనే నమ్మకంతోనే అక్టోబరు 5న చాణక్య చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
దసరా సెలవుల్లో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి సినిమా ఉన్నా, అందరికీ టికెట్స్ దొరికే అవకాశం లేదు. సైరా టికెట్స్ దొరకని వాళ్లు, డిఫరెంట్ సినిమాలు చేసే వాళ్లు చాణక్య థియేటర్స్ కి వెళ్లే అవకాశం ఉంది. పైగా రాబోయేది దసరా సీజన్, పండగ సీజన్ లో ఒక సినిమానే కాకుండా మరో సినిమా ఆడే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవాలనే చాణక్య సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సంక్రాంతి సీజన్ లో కూడా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాటిలో రెండు సినిమాలు మాత్రం టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబట్టాయి. ముఖ్యంగా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఎఫ్2 వంద కోట్ల వసూళ్లని రాబట్టింది. దసరాకి కూడా సైరా సినిమా సూపర్ హిట్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తే, చాణక్య డీసెంట్ హిట్ గా నిలిచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. లాంగ్ వీకెండ్, పండగ సెలవలు కలిసొస్తాయి కాబట్టి చాణక్య వసూళ్లు మంచి గ్రోత్ కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.