జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్-అమ్ము అభిరామి యువ జంటగా, మరో కీలక పాత్రలో బేబి సహశ్రిత నటించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు ముస్తాబవుతోంది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) బారసాల (ప్రి రిలీజ్) వేడుక సందడి సందడిగా, కన్నుల పండువగా జరిగింది. ఇదివరకు ఈ చిత్రంలోని ఆడియో సాంగ్స్‌ను కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేతుల మీదుగా విడుదల చేయగా, ఈ బారసాల వేడుకలో వాటి వీడియో సాంగ్స్‌ను పాపులర్ యూట్యూబర్స్‌తో రిలీజ్ చేయించడం గమనార్హం.
శ్రీ రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, “ఈరోజు స్పెషల్ డే. తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టినరోజు. ఇదేరోజు మా సినిమా బారసాల జరుపుకోవడం సంతోషంగా ఉంది. శ్రీ రంజిత్ మూవీస్ 46 సంవత్సరాలుగా సినిమాలు తీస్తూ వస్తోంది. నాది ఇంట్రెస్టింగ్ జర్నీ. జగపతిబాబు గారి వల్ల డైరెక్టర్ విద్యాసాగర్ రాజు నాలుగేళ్ల క్రితం పరిచయమయ్యారు. ఈ స్క్రిప్ట్‌పై దాదాపు ఏడాది పాటు వర్క్ చేశాం. స్క్రీన్‌ప్లే పరంగా కానీ, కాస్టింగ్ పరంగా కానీ, టెక్నీషియన్స్ పరంగా కానీ ది బెస్ట్ చేశామని నమ్ముతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి విషయంలోనూ ఈ సినిమా ది బెస్ట్. నాకు యూనిక్ స్క్రిప్ట్లంటే ఇష్టం. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్ప సినిమా చెయ్యను. నేనెప్పుడూ ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాను. ప్రేక్షకులు ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ న్యాయం జరగాలనుకుంటాను. నేను ఖర్చుపెట్టే ప్రతి రూపాయీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రొడక్ట్ బాగుంటే దానికి పనిచేసే ప్రతి ఒక్కరి కెరీరూ బాగుంటుంది. నాకు వ్యాపారపరంగా బాగుంటుంది. నేను నమ్మే సూత్రం ఇదే! తొమ్మిది నెలల కొవిడ్ మహమ్మారి తర్వాత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను గౌరవించాలనీ, వారి సర్వీసుకు కృతజ్ఞతలు తెలియజెయ్యాలనే ఉద్దేశంతో ఈ సినిమా పాటలను వారి చేతుల మీదుగా రిలీజ్ చేశాం. మహమ్మారి టైమ్‌లో సినిమాలు లేకపోవడంతో యూట్యూబ్ స్టార్స్ ఆడియెన్స్‌కు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సినిమా స్టార్స్‌కు ఉన్న పాపులారిటీ సంపాదించారు. అందుకే వారి చేతుల మీదుగా ఈరోజు వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేసాము. ఈ సినిమాకి నాతో పాటు ట్రావెల్ చేసి, ఇంత బాగా రావడానికి తోడ్పడిన నా టీమ్ కు థాంక్స్ చెప్పుకుంటున్నా. అలా మొదలైంది మూవీ నుంచి ప్రతి సినిమాకీ మేం న్యూ టాలెంట్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాం. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా శివను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తను ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు బాలాదిత్య, కరుణాకర్ జంట రచయితలుగా పనిచేశారు. నటుడు బాలాదిత్య రైటర్‌గా పరిచయమవుతున్నాడు. ఆ ఇద్దరూ డైలాగ్స్‌తో పాటు లిరిక్స్ రాశారు. ఇప్పటిదాకా నా సినిమాలకు కల్యాణీ మాలిక్ మ్యూజిక్ ఇస్తూ వచ్చారు. ఈ సినిమాకు ఆయనకు బ్రేక్ ఇచ్చి భీమ్స్ సెసిరోలియోతో చేయించాను. తను ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు. మా యాక్టర్స్ జగపతిబాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, సహశ్రిత, రాజా దగ్గుబాటి తదితరులు చాలా బాగా చేశారు.” అని చెప్పారు.
ఆ తర్వాత చిత్రంలోని వీడియో సాంగ్స్‌ను యూట్యూబ్ స్టార్స్ రిలీజ్ చేశారు. “ముఝ్ సే ఏక్ సెల్ఫీ లేలో” సాంగ్‌ను బబ్లూ, “నేనేం చెయ్య..” పాటను దుర్గారావు దంపతులు, “మన మనసు కథ” పాటను దేత్తడి హారిక, “హే హుడియా ప్రేమలో పడిపోయా” సాంగ్‌ను దిల్ సే మెహబూబ్, “గారాలపట్టి నా గుండెతట్టి” పాటను షణ్ముఖ్ జస్వంత్ రిలీజ్ చేశారు. జగపతిబాబుకు చిన్నప్పట్నుంచీ తాను ఫ్యాన్‌ననీ, ఆయనతో కలిసి ఓ స్టెప్ వెయ్యాలనేది తన కోరిక అనీ దుర్గారావు చెప్పగా, జగపతిబాబు స్టేజి మీదకు వచ్చి నేనేం చెయ్య పాటకు దుర్గారావుతో కలిసి స్టెప్పులేశారు. దేత్తడి హారికతో కలిసి భరత్, సునీల్ డాన్స్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో మాట్లాడుతూ, తాను హైస్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఫొటోతో పాటు ఆటోగ్రాఫ్ కావాలని తను లెటర్ రాస్తే చెన్నై నుంచి తనకు ఆటోగ్రాఫ్‌తో ఓ ఫొటో వచ్చిందనీ, అది జగపతిబాబు గారిదనీ తెలిపారు. హీరో అంటే తనకు మొదట తెలిసింది ఆయనేననీ అన్నారు. చిన్న కలలనీ, కన్నీళ్లనీ పొదుపు చేసుకొని ప్రయాణిస్తూ ఇక్కడికొస్తే, సుమారు ఇరవై ఏళ్ల ప్రయాణం తర్వాత జగపతిబాబు గారిని కలుసుకొని, ఆయనతో కలిసి పనిచేశాననీ చెప్పారు. భీమ్స్ ఎమోషనల్‌గా మాట్లాడుతుండగా, జగపతిబాబు వేదిక మీదకొచ్చి ఆయనను ఆత్మీయంగా కౌగలించుకున్నారు.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, ఫిల్మ్‌చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ సెక్రటరీ సి.ఎన్. రావు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడి, సినిమా ఘన విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.ఈ సినిమా బిగ్ టిక్కెట్టును హీరో సునీల్ వెయ్యి రూపాయలకు కొనుగోలు చేశారు.రైటర్‌గా మారిన నటుడు బాలాదిత్య మాట్లాడుతూ, “జగపతిబాబు సినిమా సంకల్పంలో ఆయన చిన్నప్పటి క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ఆయన సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం రావడం వండర్ఫుల్ ఆపర్చునిటీ. తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టిన రోజున నేను డైలాగ్ రైటర్‌గా పుట్టాను. అలాగే ఇందులో మూడు పాటలు రాశాను. వాటిలో ఓ ఇంగ్లీష్ పాటను కూడా రాయగలిగాను” అన్నారు.
రైటర్ కరుణాకర్ మాట్లాడుతూ, “గేయరచయిత అయిన నన్ను విద్యాసాగర్ రాజు తన ‘రచయిత’ అనే మూవీతో డైలాగ్ రైటర్‌గా పరిచయం చేశారు. ఆ సినిమా తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. నా లైఫ్‌లో ఓ బ్యూటిఫుల్ డైమండ్ ఈ సినిమా” అన్నారు.
నటుడు భరత్ మాట్లాడుతూ, “ఈ సినిమా విజువల్స్ చూశాక అందులో కనిపించింది నేనేనా అని నాకే డౌట్ వేసింది. నన్ను చాలా బాగా చూపించారు. నా చిన్నప్పుడు జగపతిబాబు గారు ఎలా ఉన్నారో, ఇప్పుడు నేను పెద్దయ్యాక కూడా ఆయన అలాగే ఉన్నారు. రామ్ కార్తీక్ చాలా మంచి మనిషి. అమ్ము అభిరామికి ఉన్న లక్షలాది మంది ఫ్యాన్స్‌లో నేనూ ఒకడ్ని. ఇండస్ట్రీకి ఆమె ఒక బ్లెస్సింగ్. ఒక నటుడిలోని తెలీని డైమన్షన్‌ను బయటకు లాగే డైరెక్టర్ విద్యాసాగర్ రాజు. శ్రీ రంజిత్ మూవీస్ లెగసీని దాముగారు కొనసాగిస్తున్నారు” అన్నారు.
హీరోయిన్ అమ్ము అభిరామి మాట్లాడుతూ, “ఇలా హీరోయిన్గా ఓ మంచి టీమ్ ద్వారా లాంచ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఐ యామ్ సో బ్లెస్డ్. దాముగారు నాకు గాడ్‌ఫాదర్‌లా అయిపోయారు. జగపతిబాబు గారు, రామ్ కార్తీక్, భరత్, టీమ్ మొత్తం నా ఫ్యామిలీలా అనిపించింది. ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ ట్రీట్‌లాగా, ఓ ఫీస్ట్‌లాగా ఉంటుంది” అన్నారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, “సినిమాకు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. శ్రీ రంజిత్ మూవీస్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. దాముగారు తలుచుకుంటే నా ప్లేస్‌లో పెద్ద స్టార్ ఉండేవారు. క్యారెక్టర్స్‌కు తగ్గ కాస్టింగ్‌ను నమ్ముతారు కాబట్టే నాకు చాన్స్ ఇచ్చారు. విద్యాసాగర్ రాజు పని రాక్షసుడు. సినిమా తప్ప ఆయనకు వేరే ప్రపంచం లేదు. లెజెండ్ లాంటి జగపతిబాబు గారితో కలిసి నటించే అవకాశం నాకు లభించింది. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవల్. భీమ్స్ అమేజింగ్ ఆల్బమ్ ఇచ్చారు. ఆల్బమ్ మొత్తం వైరల్ అయ్యింది” అన్నారు.
నటుడు సునీల్ మాట్లాడుతూ, “ఈ సినిమా ద్వారా అందరికీ మంచి కెరీర్ రావాలని కోరుకుంటున్నాను. సాల్ట్, పెప్పర్ తినే ప్రతి మనిషీ ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను” అన్నారు. డైరెక్టర్ విద్యాసాగర్ రాజు మాట్లాడుతూ, సినిమా అందరికీ నచ్చుతుందనీ, అందరూ ఎంజాయ్ చేస్తారనీ ఆశిస్తున్నానని చెప్పారు.
ప్రధాన పాత్రధారి జగపతిబాబు మాట్లాడుతూ, “ఫ్రంట్‌లైన్ వారియర్స్, యూట్యూబర్స్ మా సెలబ్రిటీలనేది ఎక్సలెంట్ థాట్. ఎవరూ ఆ పనిచెయ్యలేదు. ఆ ఆలోచన చేసినవాళ్లను ప్రశంసిస్తున్నాను. 300 మంది కష్టపడితే ఓ సినిమా వస్తుందని మెహబూబ్ అన్నాడు. కానీ ఒక్కరే వన్ మ్యాన్ షోగా కష్టపడి యూట్యూబర్‌గా పేరు తెచ్చుకుంటున్నారంటే.. మీరు గొప్పవాళ్లు. మిలియన్ల మందికి వినోదాన్నిస్తున్నారు. ఆసమ్. ఐ యామ్ రియల్లీ హ్యాపీ. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఈ ప్రాజెక్ట్ స్టార్టయినప్పుడు టైటిల్, సినిమా బాగుండాలని డైరెక్టర్ సాగర్‌కు చెప్పాను. టైటిల్ ‘ఎఫ్‌సీయూకే’ అని చెప్పాడు. చాలా బాగుందన్నాను. టీజర్ కూడా ఆల్రెడీ సక్సెసయ్యింది. టైటిల్‌ను చూసి, కొంతమంది వేరేగా అనుకుంటున్నారు. ఈ సినిమాలో బూతు లేదు. జనాలకు రీచ్ కావాలనే ఆ టైటిల్ పెట్టాం. ఫైనల్‌గా ఆ టైటిల్‌కు అర్థం ‘ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్’ అనే. ఇది హిలేరియస్ ఫిల్మ్. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైనర్ ఈ సంవత్సరం ఇంకా రాలేదు కాబట్టి, ఈ సినిమా ఆ ఎంటర్టైనర్ కాబోతోందని ఆశిస్తున్నాను.” అన్నారు.