“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” నుంచి ‘బ్యాడ్’ థీమ్ సాంగ్ విడుదల

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ గల యువ కథానాయకులలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్, మరో విభిన్న చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన “లంకల రత్న” అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే, ఈ చిత్రం నుండి విడుదలైన ‘సుట్టంలా సూసి’ పాట యూట్యూబ్‌లో 50 మిలియన్లకు పైగా వీక్షణలతో సంచలనం సృష్టించింది. అలాగే “మోత” గీతం మాస్ ని ఉర్రూతలూగిస్తోంది. ఆ చార్ట్‌బస్టర్ల తర్వాత, మేకర్స్ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి “బ్యాడ్” థీమ్ సాంగ్‌ను మే 10న ఆవిష్కరించారు.

సంగీతంలో ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపిస్తూ, సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు యువన్ శంకర్ రాజా. ముఖ్యంగా చిత్ర కథా నేపథ్యాన్ని తెలుపుతూ సాగే థీమ్ పాటలను స్వరపరచడంలో ఆయన దిట్ట. ఇప్పుడు “బ్యాడ్” గీతంతో మరోసారి తన అత్యుత్తమ సంగీత ప్రతిభను ప్రదర్శించారు. యువన్ శంకర్ రాజా తనదైన ప్రత్యేక శైలిలో స్వరపరిచిన ఈ పాట.. సంగీత ప్రియుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఈ “బ్యాడ్” గీతం చిత్రంలోని చీకటి ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ సాగింది.

‘లంకల రత్న’ పాత్ర తీరుని తెలియజేస్తూ సాగిన “బ్యాడ్” గీతంలోని సాహిత్యం అద్భుతంగా ఉంది. బలమైన పదాలతో, లోతైన భావాలను పలికిస్తూ కళ్యాణ్ చక్రవర్తి అందించిన సాహిత్యం కట్టిపడేసింది. ముఖ్యంగా ప్రముఖ రచయిత-దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన సాకి.. ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.