ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. బ్రిటిష్ ఆకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ ‘బాఫ్టా బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్’గా ఆయనను నియమించింది. ఇప్పటివరకు భారతదేశానికి చెందిన ఎవరికీ ఇలాంటి గౌరవం దక్కలేదు. దీంతో రెహమాన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జ్యూరీ సభ్యులు, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి దేశంలోని సినిమా, క్రీడలు, టెలివిజన్ రంగాల్లో ప్రతిభావంతులైన కళాకారులను రెహమాన్ గుర్తించనున్నారు. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన కళాకారులకు సంవత్సరం పాటు బాఫ్టా సలహాలు, సూచనలు చేయనుంది. తనను అంబాసిడర్‌గా నియమించినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇప్పటివరకు ఎవరికీ దక్కని గౌరవం తనకు దక్కడం అదృష్టమని రెహమాన్ చెప్పాడు.
భారత్ నుంచి అద్భుతమైన టాలెంట్‌ను బయటకు తీసి ప్రపంచ వేదికపై నిలిపే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నాడు. బాఫ్టాతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నాడు. కాగా ఇండియాలోని అన్ని భాషల్లో మ్యూజిక్ డైరెక్టర్‌గా సినిమాలకు రెహమాన్ వర్క్ చేశాడు. ఆయన మ్యూజిక్కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.