బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసు విషయంలో అతని కుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ముంబై పోలీసుల నుంచి సీబీఐ స్వాధీనం చేసుకున్నందున, దర్యాప్తు కోసం మునుపటి కంటే ఎక్కువ మందిని విచారించారు. ప్రధాన సాక్షులలో ఒకరైన సుశాంత్ ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పిథానిని సీబీఐ ఆఫీసర్లు వరుసగా ఆరో రోజు విచారణ చేశారు.
అయితే నటుడు ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు చెప్పిన సిద్ధార్థ్ పిథాని మరో షాకింగ్ విషయం కూడా బయటపెట్టినట్లు బాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇండియా టుడేలో ఒక నివేదిక ప్రకారం, జూన్ 8 న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్లాట్ లో ఉన్న మొత్తం ఎనిమిది హార్డ్ డ్రైవ్‌లు ధ్వంసమయ్యాయని సిద్ధార్థ్ పిథాని సీబీఐకి వెల్లడించారు. రియా చక్రవర్తి చివరగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ని విడిచిపెట్టిన తేదీ కూడా అదే. జూన్ 14న సుశాంత్ మరణించాడు. ఇక హార్డ్ డ్రైవ్స్ తో పాటు పలు ఫైళ్ళ గుట్టు రాబట్టేందుకు ఐటి నిపుణులను పిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు, ఆ హార్డ్ డ్రైవ్‌లలో ఏముంది అవి ఎందుకు నాశనం చేయబడ్డాయి అనే విషయాలు తెలియాల్సి ఉంది. అదే విధంగా హార్డ్ డ్రైవ్ల యొక్క ఈ విధ్వంసం గురించి సుశాంత్ కు అసలు తెలుసా అనేది కూడా ఎవరికి తెలియదు. జూన్ 8 న సుశాంత్, రియాకు మధ్య గొడవ మాత్రం నిజంగా జరిగిందని సిద్ధార్థ్ పిథాని సీబీఐ విచారణలో బయటపెట్టారు. దీంతో త్వరలోనే ఈ విషయంపై సీబీఐ రియాను విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.