“అల్లు రామలింగయ్య” వస్తే సందడే సందడి

  • నా చిన్నతనం నుండీ “అల్లు రామలింగయ్య”గారి నటనంటే నాకు “నవ్వంత” ఇష్టం. ఆయన హావభావాలు,బాడీలాంగ్వేజ్ గిలిగింతలు పెడతాయి.
  • ఇప్పటికీ యూట్యూబ్ పుణ్యమా అని తరచూ వారి హాస్యనిధిని కొల్లగొడుతుంటాను.
  • నేను సీనియర్ నిర్మాత “జయకృష్ణ” గారి సినిమాకు దర్శకత్వం చేస్తున్నప్పుడు ఇందిరానగర్ లోని (ప్రస్తుత గ్రీన్‌బావర్చికి సమీపంలో) ఆఫీసుకు తరచూ వొచ్చి కొంత సమయం గడిపి వెళ్ళేవారు రామలింగయ్య గారు.
  • ఆయనొస్తే సందడే సందడి. అంతటి వయోభారంలోనూ ఎంతో హుషారుగా ఆయన వేసే జోకులకు మా పొట్టలు చెక్కలయ్యేవి.
  • జయకృష్ణ గారి మిత్రులైన “పోతరాజు”గారిలాంటి సీనియర్ మేకప్‌మెన్లు, “కైకాల సత్యనారాయణ” గారివంటి పెద్దవారు అప్పుడప్పుడూ అక్కడికొచ్చి కాలక్షేపం చేసేవారు. వారి మధ్య పాత విషయాలన్నీ చర్చకు వొస్తున్న సందర్భంలో ఓసారి “అల్లు”గారు చెప్పిన ఓ సంఘటన మనసుకు హత్తుకొంది.
  • ఓ కాలంలో అత్యధిక పారితోషికం అందుకున్న సీనియర్ నటులు “చిత్తూరు నాగయ్య” గారు తాను చేసిన దానధర్మాల వల్ల చివరిదశలో ఆర్ధికంగా బాగా ఇబ్బందులు పడేవారట.ఆయన ఇంట్లోవున్న షీల్డులను,వస్తువులను కూడా అమ్మకానికి పంపడం తెలిసి అల్లు గారు,సహనటులు బాధ పడేవారట.
  • మనం చేయగలిగిందేదైనా ఆయనకు చేయాలి అనుకున్నారట.
  • ఓ సహనటుడు (పేరు గుర్తులేదు) ఇచ్చిన ఐడియాతో, ఇద్దరూ కలిసి ఒక బియ్యం బస్తా కొని రిక్షాలో వేసుకుని నాగయ్యగారింటికి వెళ్ళారట.
  • ఎందుకిది అని ఆయన అడిగితే “ఈ బియ్యం కొన్నవి కావండీ. ఊర్లో మా పొలంలో పండినవి. మీ మిత్రులకిచ్చి రుచి చూడమను అని మా పెద్దవాళ్ళు నాలుగు బస్తాలు పంపారు. ఇద్దరు మిత్రుల ఇళ్ళలో రెండుబస్తాలు వేసి వెళుతుంటే ,దారిలోనే మీ ఇల్లు వుందికదా అని గుర్తొచ్చి మీక్కూడా ఒక బస్తా వేశాము అంతే. మీరు రుచి చూసి చెబితే మా వాళ్ళు చాలా సంతోషపడతారు వద్దనకండి” అని నమస్కారం పెట్టి వొచ్చేశారట.
  • ఆ పెద్దాయన ఆత్మగౌరవానికి భంగం కలగకూడదని అబధ్ధమాడిన వీళ్ళదెంతటి ఆత్మసౌందర్యమో చూడండి.

(నా గీతల్లో తెలుగువారిపై అమృతమై కురిసిన హాస్యపుజల్లు “అల్లు”)