సినిమా ఇండస్ట్రీలో నిర్మాత పాత్ర ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల రిలీజ్ తరువాత కష్టమైనా నష్టమైనా ఒంటరిగా భారాన్ని మోసే నిర్మాతల పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. రిలీజ్ కి సిద్దమైన సినిమాలు అలాగే సగంలో షూటింగ్స్ ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి.
వందల కోట్ల పెట్టుబడులు పెట్టి నిర్మించిన సినిమాలు కరోనా ధాటికి కోన ఊపిరితో కొట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో నటీనటుల నుంచే నిర్మాతలకు మద్దతు అందాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పటికే తమిళనాడులో చాలా మంది తారలు వారి పారితోషికాన్ని తగ్గించుకున్నారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఆ లిస్ట్ లో చేరాడు.
తన రెమ్యునరేషన్ లో 20% డిస్కౌంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరం అయితే ఇంకా తగ్గించాలని కూడా అనుకుంటున్నారట. నెక్ట్స్ ఈ హీరో ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.