ధనుష్ ప్రధాన పాత్రలో ‘ఇళయరాజా’ బయోపిక్?

మాస్ట్రో, ఇసైజ్ఞానిగా ప్రేక్షకులను తన సంగీత స్వర సాగరంలో ముంచెత్తిన ఇళయరాజా అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. అందుకు కారణం చాలా రోజుల నుంచి వారు ఆయన ఇళయరాజా బయోపిక్ ఎప్పుడు ప్రారంభమవుతుందా! అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మ్యాస్ట్రో బయోపిక్ ‘ఇళయరాజా’ పేరుతో బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే ఇళయరాజా మూర్తీభవించిన రెట్రో లుక్‌లో ధనుష్ కనిపిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా కూడా పాల్గొన్నారు. ఇంకా డైరెక్టర్ వెట్రిమారన్, త్యాగరాజన్ కుమారరాజా సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  కనెక్ట్ మీడియా, పి.కె.ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యురీ మూవీస్ బ్యానర్స్‌పై శ్రీరామ్ భక్తిశరణ్, సి.కె.పద్మకుమార్, వరుణ్ మాథుర్, ఇలం పరితి గజేంద్రన్, సౌరభ్ మిశ్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ముత్తురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ ‘‘చిన్నప్పటి నుంచి నేను మాస్ట్రో ఇళయరాజాగారు అందించిన అద్భుతమైన మెలోడి పాటలను విని మైమరచిపోయేవాడిని. ఇప్పుడు ఆయన బయోపిక్ చేస్తుండటం చూస్తుంటే కల నిజమైనట్లు అనిపిస్తుంది. నా జీవితంలో మరచిపోలేని క్షణాలవి. మనం మనసులో బలంగా కోరుకుంటే అవి నిజమవుతాయని అంటుంటాం. జీవితం అనేది అసాధారణమైన విషయం ఎన్నో మరుపరాని క్షణాలు, అనుభవాలతో అల్లిన వస్త్రంలాంటిది. మనం హృదయపూర్వకంగా బలంగా ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు అవి నిజమవుతాయి. చాలా మంది ప్రశాంతమైన నిద్ర కోసం ఆయన పాటలతో సాంత్వన పొందుతుంటారు. అయితే నేను మాత్రం ఆయన అసాధారణ జీవితాన్ని వెండితెరపై చిత్రించాలనే కలల్లో మునిగిపోయాను. నా కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇళయరాజాగారి సంగీతం నన్ను నటుడిగా మెరుగుపరుచుకోవటానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఏదైనా అసాధారణ పాత్రలో నేను నటించాల్సి వచ్చినప్పుడు ఇళయరాజాగారి పాటలను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటాను. అవి నాలోని నటనను పరిపూర్ణంగా ఆవిష్కరించేలా చేస్తాయి. ఇసైజ్ఞాని ఇళయరాజాగారు నాకు మార్గదర్శకంగా, దారి చూపే వెలుగుగా ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఈ సందర్భంలో ఇళయరాజాగారికి నిజమైన ఆరాధకుడు, గౌరవనీయులైన కమల్ హాసన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రేమ, కళాత్మకతను జోడించాల్సిన సమయం. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ ఓ గొప్ప బాధ్యతను స్వీకరించారు. ఈ ప్రయాణంలో ప్రతీ క్షణాన్ని తను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా తనకు నేను తోడ్పాటు అందిస్తాను” అన్నారు.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ అరుణ్ మాదేశ్వరన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయటం అనేది ఆయనకు గొప్ప బాధ్యతను ఇవ్వటంతో పాటు ఒత్తిడిని కూడా ఇస్తుంది. భారతరత్న అవార్డ్ గ్రహీత ఇళయరాజా గురించి చేస్తున్న సినిమాను అరుణ్ అస్వాదించవచ్చు. అంతేకాకుండా దాన్ని చక్కటి సినిమాగానూ ప్రదర్శింప చేయవచ్చు. ఇది అనేకమంది వ్యక్తులపై వైవిధ్యమైన ప్రభావాలను చూపుతుంది. ఈ సినిమాకు పదికిపైగా వ్యాఖ్యాలు కూడా ఉంటాయి. కాబట్టి దర్శకుడు సంగీత ప్రపంచానికి గర్వ కారణమైన ఇళయరాజా బయోపిక్ను తనదైన కోణంలో తెరకెక్కించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఇదే సందర్భంలో గుణ సినిమా కోసం ఇళయరాజా స్వరపరిచిన ‘కన్మణి అన్బోడ కాదలన్’ అనే పాటను గుర్తు చేసుకుంటూ ఇది ప్రేమ, భావోద్వేగాల అందమైన కలయికగా అభివర్ణించారు.