మళ్లీ మెంటల్లీ డిజాడర్ పాత్రలో ఆమీర్ ఖాన్, ఈసారి రీమేక్…

బాలీవుడ్ ని మూడు దశాబ్దాల పాటు ఏలిన ఖాన్ త్రయంకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది. మిగిలిన హీరోలు సూపర్ హిట్స్ ఇస్తుంటే, ఈ ఖాన్ త్రయం నష్టాలు తెచ్చే సినిమాలు చేస్తూ మార్కెట్ దెబ్బ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆమీర్ ఖాన్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతో దారుణంగా నిరాశపరిచాడు. పీకే, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రాలతో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఆమిర్ ఖాన్, బాహుబలి లాంటి సినిమా చేయాలనే ఆలోచనతో థగ్స్ చేసి చేతులు కాల్చుకున్నాడు.

దాదాపు మూడు వందల కోట్ల బడ్జట్ తో తెరకెక్కి 2018లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో భారీ నష్టాలని మిగిలించింది. దీంతో ఏడాదిగా ఆమీర్ మరో సినిమా చేయలేదు. బాగా గ్యాప్ తీసుకున్న ఆమీర్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. 1994 టామ్ హంక్స్ హీరోగా వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ సినిమాకి ఇది రీమేక్. మెంటల్లీ, ఫీజికల్లీ ప్రాబ్లెమ్స్ ఫేస్ చేసే పర్సన్ గా ఆమీర్ కనిపించనున్నాడు. సరైన పాత్ర తగిలితే అద్భుతంగా నటించి మెప్పించగల ఆమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. సింగ్ గెటప్ లో ఆమీర్ ఖాన్ చాలా కొత్తగా ఉన్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కిరణ్ రావ్, వియాకామ్ 18 స్టూడియోస్ తో కలిసి లాల్ సింగ్ చద్దా ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా లాల్ సింగ్ చద్దా విడుదల కానుంది అంటే మరో ఏడాది పాటు ఆమీర్ సినిమా లేనట్లే.