నందమూరి బాలకృష్ణ.. సినీ ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్‌ల వారందరికీ… రోగ నిరోధక శక్తి పెరిగే విటమిన్ టాబ్లెట్స్, హోమియో మాత్రలను.. పంపుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పంపిణీ చేశారు కూడా. అయితే.. ఈ విషయాన్ని ఆయన ఎక్కడా ప్రెస్మీట్లు పెట్టి చెప్పుకోలేదు. ప్రత్యేకంగా సోషల్ మీడియా టీంలతో ప్రమోట్ చేసుకోలేదు. ఈ టాబ్లెట్లను అందుకున్న వారు బయటకు చెప్పడంతోనే తెలిసింది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్.. తనకు బసవతారకం ఆస్పత్రి నుంచి అందిన విటమిన్ టాబ్లెట్స్, హోమియో మాత్రల గురించి సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. నా ఒక్కడికి మాత్రమే కాదు. సినీ పరిశ్రమకు చెందిన 24 విభాగాల వారికి పంపిస్తున్నారు. నన్ను గుర్తుపెట్టుకుని మరీ మందులు పంపిన బాలకృష్ణకు ధన్యవాదాలని చెప్పుకొచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. పేదలకు ఉచితంగా క్యాన్సర్ వైద్యం అందించేందుకు ఆ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. విరాళాలు సేకరించి.. ఆ ఆస్పత్రికి మౌలిక సదుపాయాలు పెంచడంలో.. బాలకృష్ణ విశేష కృషి చేశారు. అంతే కాదు.. ఆయన రోజువారీ ఆస్పత్రి వ్యవహారాలను పర్యవేక్షిస్తారు కూడా. తన ఇంట్లో శుభకార్యం అయినా… ఏదేని ఇతర శుభసందర్భం అయినా… ముందుగా క్యాన్సర్ ఆస్పత్రినే సందర్శిస్తారు. రోగుల్ని… ఉద్యోగుల సమస్యల్ని ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆ ఆస్పత్రి చైర్మన్‌గా కొన్ని వందల మంది సినీ కార్మికులకు కూడా… ఉచితంగా క్యాన్సర్ వైద్యం అందించారు. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను.. కరోనా కాటు నుంచి రక్షించడానికి తన వంతుగా .. రోగ నిరోధక శక్తి పెంచేందుకు… మందులను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ.. విటమిన్ టాబ్లెట్లు కొని.. వాడుతూండటంతో.. వాటి కొరత అధికంగా ఉంది. ఇలాంటి సమయంలోనూ… అందరికీ… విటమిన్ టాబ్లెట్లు.. హోమియే మందులను బాలకృష్ణ పంపిణీ చేయడం.. ఇండస్ట్రీ వర్గాలను .. సంతృప్తి పరుస్తోంది.