

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతంగా ‘అసుర హననం’ విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ, హిందీ వ్యాఖ్యాతలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.
‘అసుర హననం’ గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అసురులపై పోరాడుతున్న యోధుడి యొక్క వీరత్వాన్ని చాటిచెప్పేలా సంగీతం, సాహిత్యం ఉన్నాయి. శ్రోతలలో పోరాట స్ఫూర్తిని రగిల్చేలా కీరవాణి సంగీతం శక్తివంతంగా ఉంది. ఆ సంగీతానికి తగ్గట్టుగా గీత రచయిత రాంబాబు గోశాల.. తన పదునైన సాహిత్యంతో కట్టిపడేశారు. “భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం” వంటి పంక్తులతో తన కలం బలం చూపించారు. గాయనీగాయకులు ఐరా ఉడుపి, కాల భైరవ, సాయిచరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్ తమ గాత్రంతో గీతాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళారు.
‘అసుర హననం’ గీతావిష్కరణ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, “హరి హర వీరమల్లు సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం రాధాకృష్ణ(క్రిష్)తో మొదలైంది, ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. నేను చాలామంది దర్శకులను చూశాను. కానీ, తక్కువమందిలో ఉండే అరుదైన క్వాలిటీ జ్యోతిలో ఉంది. వేగంగా నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్ని పనులు ఒక్కడే చూసుకుంటూ నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇండస్ట్రీలో వివాద రహితుడిగా ఎ.ఎం. రత్నం గారికి పేరుంది. లిరిక్ రైటర్ గా ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఈ సినిమా రూపంలో ఎ.ఎం. రత్నం గారికి మరో భారీ విజయం సొంతం అవుతుందని విశ్వసిస్తున్నాను. అలాగే నిర్మాత దయాకర్ గారంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో ఉంది. రాంబాబు లాంటి మంచి గీత రచయితను నాకు జ్యోతికృష్ణ పరిచయం చేశారు. నిధి అగర్వాల్ తన పాత్రను చక్కగా పోషించింది. పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ పవర్ స్టార్ అంటారు. నేను మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటాను. ఆగ్రహం మనందరికీ వస్తుంది. కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం. ఆయనకు మాత్రమే సరిపోయేలా ‘హరి హర వీరమల్లు’ను తీర్చిదిద్దారు. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చు పవన్ కళ్యాణ్ గారు. కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి ఎంతో శ్రద్ధతో చేశాను. జూన్ 12న విడుదలవుతున్న ఈ సినిమాని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, “ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాము. మీ మద్దతుతో ఈ సినిమా మరో స్థాయికి వెళ్తుందని నమ్ముతున్నాను. ఇది మొదటి ప్రెస్ మీట్. మరో రెండు భారీ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఇంత భారీ సినిమాకి తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ ప్రచారం చేయాల్సి ఉంది. అందుకు మీడియా సహకారం కావాలి. సినిమా ఫీల్డ్ లో నా ప్రయాణం 54 ఏళ్ళు. తెలుగు, తమిళ, హిందీ అన్ని భాషల్లో సినిమాలు తీశాను. 90 శాతానికి పైగా నా సినిమాలు విజయం సాధించాయి. సినిమా ద్వారా వినోదంతో పాటు, ఏదో ఒక సందేశం ఇవ్వాలనేది నా తపన. భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి సినిమాలు అందించాను. హరి హర వీరమల్లు సినిమా తయారవ్వడానికి ముఖ్యకారణం పవన్ కళ్యాణ్ గారు. క్రిష్ గారు చెప్పిన కథ నచ్చి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు తీసుకెళ్ళాను. రత్నం గారి జడ్జిమెంట్ ను నమ్మి ఈ సినిమా చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. నా కుమారుడు అని చెప్పడం కాదు.. జ్యోతికృష్ణ ఈ సినిమా బాధ్యతను తీసుకొని ఎంతో కష్టపడి పని చేశాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సినిమాని పూర్తి చేశాడు. హరి హర వీరమల్లు అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లో విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.” అన్నారు.


గీత రచయిత రాంబాబు గోశాల మాట్లాడుతూ, “ఈ సినిమాలో ‘అసుర హననం’ అనే పాట రాయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. భారతీయుడు, జీన్స్, ఖుషి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాత ఎ. ఎం. రత్నం గారు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారితో ‘హరి హర వీరమల్లు’ చేసి జూన్ 12న విడుదల చేయబోతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతికృష్ణ గారికి ధన్యవాదాలు. నాతో ‘రూల్స్ రంజన్’ సినిమాలో ‘సమ్మోహనుడా’ అనే పాట రాయించారు. అది చాలా పెద్ద హిట్ అయింది. దానికి వంద రెట్లు ఈ పాట హిట్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా కోసం జ్యోతికృష్ణ గారు యుద్ధం చేశారు. ఆయన తపస్సు వల్లే ఈ చిత్రం ఇంత త్వరగా పూర్తయింది. ఇక కీరవాణి గారి సంగీతంలో పాట రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారంటే పోరాటం, పవన్ కళ్యాణ్ గారంటే ప్రకాశం, పవన్ కళ్యాణ్ గారంటే ధైర్యం, పవన్ కళ్యాణ్ గారంటే అన్ లిమిటెడ్ పవర్. దానిని సినిమాకి అన్వయించుకుంటూ పాట రాయమని జ్యోతికృష్ణ గారు చెప్పారు. నాకిచ్చిన బాధ్యతకు నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ” అన్నారు.
చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి కల ఉంటుంది. అది ఒక అవార్డు గెలుచుకున్నట్టుగా ఉంటుంది. నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మొదట ఈ ప్రాజెక్ట్ కి పెద్ద పునాది వేసింది క్రిష్ గారు. దానిని పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలని రత్నం గారు ప్లాన్ చేశారు. ఇంత పెద్ద బాధ్యతను ఒలింపిక్ టార్చ్ లాగా క్రిష్ గారు నాకు అందించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని, రత్నం గారిని మెప్పించడం మామూలు విషయం కాదు. అలాంటిది ఆ ఇద్దరూ మెచ్చారంటే.. ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయి స్పందన సొంతం చేసుకోబోతుందో మీరే ఊహించుకోవచ్చు. కీరవాణి గారితో పని చేయడం గర్వంగా ఉంది. కీరవాణి గారు అందరినీ ప్రోత్సహిస్తారు. రాంబాబు గారికి సిట్యుయేషన్ చెప్పి, పాట రాయించుకొని కీరవాణి గారిని కలిస్తే.. సాహిత్యం బాగుందని మెచ్చుకున్నారు. నన్ను కూడా ఎంతో ప్రోత్సహించారు. ఓ వైపు ప్రజాసేవ, మరోవైపు ఇచ్చిన మాట కోసం సినిమాలు చేస్తూ విశ్రాంతి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రమిస్తున్నారు. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో నాన్నగారు మొదటి సినిమా నిర్మాతలా ఈ సినిమా కోసం పని చేశారు. కత్తికి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఈ కథ.” అన్నారు.
కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “హరి హర వీరమల్లు అనేది నాకు చాలా ఎమోషనల్ జర్నీ. ఇది నాకొక ఎమోషనల్ ఫిల్మ్. ఈ సినిమాకి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎ. ఎం. రత్నం గారికి కృతఙ్ఞతలు. సినిమా కోసం అంతలా కష్టపడే నిర్మాతను నేను చూడలేదు. జ్యోతి కృష్ణ గారు ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.” అన్నారు.
నటుడు రఘుబాబు మాట్లాడుతూ, “జూన్ లో పండగలు ఏమీ లేవు. ‘హరి హర వీరమల్లు’ రూపంలో జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండుగ రాబోతుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి చారిత్రాత్మక చిత్రం చేశారు. న భూతో న భవిష్యతి అనే స్థాయిలో ఈ చిత్రం ఉంటుంది.” అన్నారు.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో.. ‘అసుర హననం’ గీతాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు. ఈ వేడుకకు తెలుగు మీడియా, జాతీయ మీడియాతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన మీడియా కూడా పాల్గొంది. గీతావిష్కరణ కార్యక్రమాన్ని ఇన్ని భాషల మీడియా సమక్షంలో ఇంత వైభవంగా నిర్వహించడం అనేది నిజంగా గొప్ప విషయమని చెప్పాలి.
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్