

తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి ప్రయోగాత్మక చిత్రానికి గౌరవం దక్కింది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ చిత్రం దాసరి ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ కథా చిత్రంగా అవార్డు సాధించి మరొకసారి కథా ప్రధానమున్న సినిమాలకు గౌరవం తీసుకువచ్చింది.
ఈ చిత్రాన్ని NRI అయిన మహేంద్ర నాథ్ కూండ్ల తన తొలి ప్రయత్నంగా నిర్మించటం విశేషం. తొలి సినిమాకే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎన్నుకొని, ఒక హృద్యమైన, భావోద్వేగాలు కలగలిపిన కథను అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కించటం ఆయనకు సినిమా పట్ల ఉన్న నిబద్దతను స్పష్టంగా చాటింది. అనిల్ క్యాట్జ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక తల్లి తన బిడ్డను రక్షించేందుకు చేసిన ఒంటరి పోరాటాన్ని మిశ్రమ భావోద్వేగాలతో కూడిన రీతిలో హృద్యంగా ఆవిష్కరించారు.
2024 మే నెలలో థియేటర్లలో విడుదలైన ‘శబరి’ చిత్రం, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందినప్పటికీ, కథా నిర్మాణంలో ఉన్న లోతు, భావోద్వేగ పరిణామాలు, ఒక తల్లి తన బిడ్డ కోసం పడే తపన, చేసిన ఒంటరి పోరాటం కారణంగా అవార్డ్స్ కమిటీ ప్రశంసలు అందుకుంది.