ఘనంగా ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక

‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించబోతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.

ఈ సందర్భంగా ‘డాకు మహారాజ్’ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయనే పేరు వచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ అంతకుమించి అనేలా ఉంది. “వాడి ఒంటి మీద పదహారు కత్తి పోట్లు, ఒక బుల్లెట్ గాయం.. అయినా కిందపడకుండా అంత మందిని నరికాడంటే అతను మనిషి కాదు, వైల్డ్ యానిమల్” అనే డైలాగ్ తో బాలకృష్ణ పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో తెలిపారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారని రిలీజ్ ట్రైలర్ తో మరోసారి స్పష్టమైంది. అలాగే బాలకృష్ణ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగ్ లకు పెట్టింది పేరు. ‘డాకు మహారాజ్’లోనూ అలాంటి డైలాగ్ లకు కొదవ లేదని రిలీజ్ ట్రైలర్ తో రుజువైంది. “రాయలసీమ మాలూమ్ తేరే కో. ఓ మేరా అడ్డా”, “ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారు.. నేను చంపడంలో చేశా” వంటి డైలాగ్ లతో బాలకృష్ణ అదరగొట్టారు. అలాగే రిలీజ్ ట్రైలర్ లో విజువల్స్, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి.

ప్రీ రిలీజ్ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాధాకర ఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుకను రద్దు చేయడం జరిగింది. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే వారు మా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇన్ని లక్షల, కోట్ల మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను ఆయన ప్రతిరూపంగా మీ హృదయాల్లో నిలిపిన దైవాంశ సంభూతులు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావుకి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాన్న గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, ఆయన మాదిరిగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించుకుంటూ వస్తున్నాను. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల్లో నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే అప్పట్లో ‘ఆదిత్య 369’లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ఈ ‘డాకు మహారాజ్’ కథ పుట్టింది. ఈరోజు విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాలకృష్ణ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉంది. దర్శకుడు బాబీ ఆలోచనకు తగ్గట్టుగా, కెమెరామెన్ విజయ్ కన్నన్ గారు తన అద్భుత పనితీరుతో సన్నివేశాలకు ప్రాణం పోశారు. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ తరహాలో మరోసారి అద్భుతమైన సంగీతం అందించాడు. ఎడిటర్స్ రూబెన్, నిరంజన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఫైట్ మాస్టర్ వెంకట్ ఇలా టీం అంతా మనసు పెట్టి పని చేశారు. ప్రతిభగల నటీమణులు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన పాత్రలు పోషించారు. యానిమల్ రాకముందే బాబీ డియోల్ గారిని ఈ సినిమాలో తీసుకున్నాం. ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుంది. మూడు వరుస ఘన విజయాల తర్వాత వస్తున్న ‘డాకు మహారాజ్’తో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకముంది. ఇక ముందు కూడా ఇలాగే మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తున్నాను. సంక్రాంతికి విడుదలైన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతున్న ‘డాకు మహారాజ్’ కూడా ఘన విజయం సాధిస్తుంది. మీరు ఏం ఊహించుకుంటున్నారో అంతకంటే మించే ఈ సినిమా ఉంటుంది. అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు.” అన్నారు.

దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, “వాల్తేరు వీరయ్య సినిమా జరుగుతున్నప్పుడు నాగవంశీ గారు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా ఒకే ఒక మాట అడిగారు. ఈ సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు. బాలయ్య బాబు గారితో ఒక సినిమా చేయాలి అన్నారు. అక్కడి నుంచి ఎప్పుడు కలిసినా బాలయ్య బాబు గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సినిమా విడుదల తర్వాత మళ్లీ బాలకృష్ణ గారిని ఒక రోజు కలవాలి అని చెప్పారు. నిజానికి అంతకంటే ముందే ఒకరోజు పూరి జగన్నాథ్ గారి ఆఫీసులో బాలకృష్ణ గారిని కలిసాను. చాలా కూల్ గా మాట్లాడారు. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ఆరోజే నేను చూశాను. ఆ తర్వాత ఈ సినిమా కోసం నేను, వంశీ గారు వెళ్ళి బాలకృష్ణ గారిని కలిశాము. ఆరోజు నుంచి అంతా పాజిటివ్ గానే జరుగుతుంది. బాలకృష్ణ గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. తనని అంతగా ప్రేమిస్తున్న అభిమానుల కోసం నేను ఎంత కష్టమైనా పడతాను అని బాలయ్య బాబు గారు చెప్పేవారు. అభిమానుల కోసం కొత్తగా ఏదైనా చేయాలని తపిస్తూ ఉంటారు. నా టీంతో కలిసి ఎంతో శ్రద్ధగా ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేశాను. బాలకృష్ణ గారితో కలిసి పని చేస్తే ఆయనను ప్రేమిస్తాం, అభిమానిస్తాం. ఆయనతో మళ్ళీ మళ్ళీ కలిసి పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశాము. అందరూ టికెట్స్ బుక్ చేసుకొని, బాలకృష్ణ గారికి మంచి ఓపెనింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఐదేళ్ల క్రితం వైకుంఠ ఏకాదశి రోజున ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాము, ఆ సినిమా జనవరి 12 ఆదివారం విడుదలైంది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ విషయంలో కూడా అదే జరిగింది. ‘అల వైకుంఠపురములో’ లాగే ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. విభిన్న లొకేషన్లలో ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాము. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.” అన్నారు.

సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, “ఈ చిత్ర బృందం సృష్టించిన డాకు మహారాజ్ ప్రపంచం చాలా గొప్పది. చాలా కొత్తగా ఉంటుంది. దీని కోసం టీం అంతా ఎంతో కష్టపడ్డారు. కోవిడ్ సమయంలో అఖండ కోసం బాలకృష్ణ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ‘డాకు మహారాజ్’ కోసం కూడా ఆ స్థాయిలో కష్టపడ్డారు. కొన్ని సినిమాలకు ప్రాణం పెట్టి సంగీతం చేయాలి అనిపిస్తుంది. ఆలాంటి సినిమా ‘డాకు మహారాజ్’. విజయ్ కన్నన్ అద్భుతమైన విజువల్స్ అందించారు. అలాంటి గొప్ప విజువల్స్ వల్లే, నేను మంచి సంగీతం ఇవ్వగలిగాను. బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నా జీవితంలో నాన్న లేరనే లోటు, బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది. నేను బాగుండాలని మనస్ఫూర్తిగా దీవిస్తారు. నన్ను ఆయన ఎంతో నమ్మారు. అందుకే బాలకృష్ణ గారి సినిమాలకి మరింత బాధ్యతగా మనసు పెట్టి సంగీతం అందిస్తాను. ఈ సినిమాతో దర్శకుడిగా బాబీ మరో స్థాయికి వెళ్తారు. నాగవంశీ గారు నా కెరీర్ లో పిల్లర్ లాగా నిలబడ్డారు. సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలవబోతుంది. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం.” అన్నారు.

కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, “ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నా అభిమాన సహ నటుల్లో ఒకరైన బాలకృష్ణ గారితో వరుస సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ గారితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. డాకు మహారాజ్ వంటి గొప్ప సినిమాతో ఆ అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నేను కావేరి అనే ఒక మంచి పాత్ర పోషించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ గారికి, సితార ఎంటర్టైన్మెంట్స్ కి కృతఙ్ఞతలు. సినిమాలో థమన్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. జనవరి 12న విడుదలవుతున్న మా డాకు మహారాజ్ సినిమాని కుటుంబంతో కలిసి థియేటర్లలో చూసి ఆనందించండి.” అన్నారు.

కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, “తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారు లాంటి ఒక లెజెండ్ తో కలిసి నటించడం అదృష్టంgaa భావిస్తున్నాను. నిజానికి బాలకృష్ణ గారిని కలవడానికి ముందు నాకు చాలా భయం ఉండేది. కానీ కలిసిన క్షణాల్లోనే నన్ను చాలా కంఫర్టబుల్ చేసేశారు. అది ఆయనకు చాలా చిన్న విషయం కానీ నాకు చాలా పెద్ద విషయం. ఎంత పెద్ద స్టార్ అయినా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మిమ్మల్ని ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అంటారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. బాబీ గారు నాకు ఈ సినిమాలో నందిని అనే పాత్రను ఇచ్చారు. ఈ పాత్ర నా కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది. సితార బ్యానర్ లో మరిన్ని చేయాలని ఉంది.” అన్నారు.

నటి ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, “అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 12న విడుదలవుతున్న మా డాకు మహారాజ్ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇది కుటుంబంతో కలిసి చూసి ఆనందించదగ్గ చిత్రం. ట్రైలర్స్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందనకు ఎంతో ఆనందంగా ఉంది. బాలకృష్ణ గారితో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. థమన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికి థాంక్స్. నాకు ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీ గారికి, నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు.” అన్నారు.

వైజాగ్ ఎంపీ భరత్, నందమూరి తేజస్విని, ఛాయాగ్రాహకుడు విజయ్ కన్నన్, రచయిత మోహన్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘డాకు మహారాజ్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.

తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్