శ్రీ శ్యామ్ బెనెగల్ మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ సంతాపం

ప్రముఖ చలన చిత్ర దర్శకుడు శ్రీ శ్యామ్ బెనెగల్ ముంబై లో 23-12-2024 న స్వర్గస్తులైనారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.

శ్రీ శ్యామ్ బెనెగల్ 14-12-1934 న హైదరాబాద్ లో జన్మించారు. ప్రకటనలు, డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలు పెట్టిన ఆయన క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు, ధారావాహికలుపైన తనదైన ముద్ర వేశారు. వాస్తవిక చిత్రాల దర్శకుడిగా తనదైన ప్రత్యేకత ప్రదర్శిస్తూ “మంథన్”, “భూమిక”, “చరణ్ దాస్ చోర్”, “త్రికాల్”, “సుహాస్” తదితర చిత్రాల్ని తెరకెక్కించారు.

ఆయన తీసిన సినిమాలు, డాక్యుమెంటరీలకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1976 లో “పద్మశ్రీ”, 1991 లో “పద్మభూషణ్”, సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన “దాదా సాహెబ్ ఫాల్కే” అవార్డు 2005 లో ఆయనను వరించింది. 2013 లో “అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం” తో ఆయనను గౌరవించారు. శ్రీ బెనెగల్ రాజ్యసభ సభ్యుడుగాను సేవలందించారు.

శ్రీ శ్యామ్ బెనెగల్ మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ సంతాపాన్ని తెలియచేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియచేయడమైనది.

(పి. భరత్ భూషణ్) (కె.ఎల్.దామోదర్ ప్రసాద్)
అధ్యక్షులు గౌరవ కార్యదర్శి