చిత్ర పరిశ్రమకు వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఇటీవల తన మేనమామలు అయిన గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. తన ప్రయాణంలో, తన ఎదుగుదలలోను తన మేనమామలు తనకు ఎలా సహాయపడ్డారు అనే విషయాన్ని తన ఈ సందర్భంగా చెప్పారు.
“నా జీవితం ఇలా సాగడానికి మావయ్యలే కారణం. కళ్యాణ్ గారు నాకు మరింత ప్రత్యేకం. నన్ను ముగ్గురు దగ్గరికి యాక్టింగ్ నేర్చుకోవడానికి పంపించారు. మొదటిగా వైజాగ్ లో సత్యనారాయణ గారికి దగ్గరకు పంపించారు. ఆ తర్వాత బొంబాయి, హైదరాబాదులో కూడా యాక్టింగ్ నేర్చుకునేలా నాకు సలహా ఇచ్చారు. కళ్యాణ్ గారు పెద్ద మామయ్య చిరంజీవి గారి ద్వారా ఎలా డాన్స్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారో, నన్ను కూడా అలాగే నేర్చుకోమని కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. దానికి నేను కళ్యాణ్ గారికి ఎంతో కృతజ్ఞుడునై ఉంటాను. ఈ 10 సంవత్సరాలలో నేను వారి ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. వారి ద్వారానే ఒక చిత్రాన్ని ఎలా తీస్తారు, ఒక చిత్రం నటించడం ఎలా, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా మలుచుకోవాలి అనే విషయాలను నేర్చుకున్నాను. మొదట్లో అంతటి ఆలోచన లేనప్పటికీ ఇప్పుడు నా ఆలోచన విధానం ఎంతో మారింది. ఎంత బాధ్యతగా సినిమాలను చేస్తున్నాను”.
మా పెద్ద మామయ్య చిరంజీవి గారి దగ్గర నుండి పట్టుదలగా ఉండడం నేర్చుకున్నాను. ఏదైనా ఒక విషయంలో ఎంత పట్టదులగా ఉండాలి, దాని వెనుక ఎంత ఉత్సాహంగా పనిచేయాలి అనేది నేర్చుకున్నాను. మా కళ్యాణ్ మామయ్య దగ్గర నిబద్ధత ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. ఏదైనా ఒక విషయాన్ని మనం నిబద్ధుడై ఉంటే కష్టమైనా చేయాలి అనే ఒక కమిట్మెంట్ తో పని చేయడం నేర్చుకున్నాను. అదేవిధంగా నాగబాబు మావయ్య దగ్గర నవ్వుతూ ఉండడం నేర్చుకున్నాను. ఎటువంటి పరిస్థితులైన సరే నవ్వుతూ ముందుకు వెళ్లి పోవాలని, ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ దానిని ఎదురించాలని నేను నేర్చుకోవడం జరిగింది” అన్నారు.