‘1980లో రాధేకృష్ణ’ సినిమా రివ్యూ

ఎస్‌వీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్‌ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎం. ఎల్. రాజా సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘1980లో రాధేకృష్ణ’. ఈ సినిమాని తెలుగు, బంజారా భాషల్లో నేడు విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్దాం..

కథ:

వంశీ తన కుటుంబంతో జాతర కోసం తన సొంతూరు కృష్ణలంక అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ కర్రసాము పోటీలు జరగడం ఆనవాయితీ. వంశీ కొడుకు రాధ వాళ్ల నాన్నని కర్రసాము గురించి అడుగుతాడు. వాళ్ల ఊళ్లో కర్రసాము పోటీలో కృష్ణ(ఎస్‌ఎస్ సైదులు)ను ఓడించేవాళ్లే లేరు అని చెబుతాడు. ఆ కృష్ణ గురించి చెప్పడం మొదలు పెట్టడంతో 1980లో ఈ కథ ప్రారంభం అవుతుంది. కృష్ణ(ఎస్‌ఎస్ సైదులు), వంశీ ఇద్దరు మంచి స్నేహితులు. వంశీ ఎక్కువ కులం, కృష్ణ తక్కువ కులం అయినా వాళ్ల మధ్య ఆ భావన లేకుండా కాలేజీలో మంచి మిత్రులుగా ఉంటారు. వంశీ పెద్దనాన్న రాఘవయ్య ఆ ఊరికి సర్పంచ్. ఆయనకు కులపిచ్చి బాగా ఎక్కువ. ఆయన కుమార్తె రాధ(భ్రమరాంబిక) వంశీ చదివే కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ కృష్ణతో రాధ ప్రేమలో పడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. రాధ-కృష్ణ ప్రేమ ఫలించిందా? లేదా ఆ ఊళ్లో కుల వివక్ష వాళ్ల ప్రేమను బలితీసుకుందా? ప్రేమ కథ మధ్యలో మావోయిస్టులు ఏం చేశారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల విశ్లేషణ:
హీరోగా నటించిన ఎస్ఎస్ సైదులు తన చక్కటి అభినయంతో ఆకట్టుకున్నాడు. అమాయకుడిగా, ప్రేమికుడిగా, పోరాట యోధుడిగా అన్ని వేరియషన్స్ పలికించాడు. హీరో ఫ్రెండ్‌గా వంశీ పాత్ర పోషించిన అతను కూడా ది బెస్ట్ పర్ఫ్మార్మెన్స్ ఇచ్చాడు. ఇక హీరోయిన్లు భ్రమరాంబిక, అర్పిత లోహి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. భ్రమరాంబిక పాత్ర నిడివి ఎక్కువ ఉండడంతో ఆమెకు తన నటనను ప్రదర్శించే ఆస్కారం ఎక్కువ ఉంది. తన నటన, అందంతో భ్రమరాంబిక ఆకట్టుకుంది. మిగిలిన పాత్రధారులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విశ్లేషణ:
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. దర్శకుడు షేక్ ఇస్మాయిల్ తను ఎంచుకున్న పాయింట్‌ను ఏ మాత్రం తడబాటు లేకుండా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఎం. రాజేష్, చరణ్, ఖమ్మం బాబు, జ్ఞానేశ్వర్, వై ఉపేందర్ అనే కుర్రాళ్లు రాసిన డైలాగ్స్ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఎంఎల్ రాజా ఇచ్చిన సంగీతం కూడా కథకు చాలా హెల్ప్ అయింది. పాటలు అన్నీ చాలా బాగున్నాయి. తనే లిరిక్స్ రాసి ట్యూన్ కట్టడం వల్ల పాటలు అన్నీ చక్కగా కుదిరాయి. తూరుపు రవికిరణం సాంగ్ ఎమోషనల్‌గా ఉంది. నిర్మాత ఊడుగు సుధాకర్ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను చక్కగా నిర్మించారు.

పాజిటివ్స్ : నటీనటుల పర్ఫార్మెన్స్, కథ, సంగీత నేపథ్యం, మంచి నిర్మాణ విలువలు.

నెగిటివ్స్ : కొన్ని లాగ్ సీన్స్, అక్కడక్కడ కనెక్ట్ కాని సీన్లు

సారాంశం : కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా.