ఆ రోజు కళ్యాణ్ బాబు కత్తి పట్టుకున్నాడు : తల్లి అంజనాదేవి

‘దీక్షలు తీసుకోవడం మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి అలవాటే. అయ్యప్పస్వామి మాల వేసుకునేవాడు. ‘అయ్యప్ప దర్శనానికి నేను వెళ్లాలి నాన్నా..’ అని ఒకసారి అడిగితే నా కోసం అయ్యప్పస్వామి మాల వేసుకున్నాడు. 40 రోజుల తర్వాత వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాం’ అని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తి శ్రీమతి అంజనాదేవి గారు తెలిపారు. జనసేన డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానెల్ తో శ్రీమతి అంజనాదేవి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, జీవన శైలి, ఆధ్యాత్మిక చింతన లాంటి విషయాలు తెలుపుతూ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

ప్రశ్న: అమ్మా… సినీ కళామతల్లికి ముగ్గురు స్టార్స్ ని ఇచ్చారు. ఇప్పుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తయ్యింది. దీన్ని మీరు ఎలా ఫీలవుతున్నారు?

ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు అంత సుఖం వచ్చింది. ఇప్పుడు ఇంకా బాధ్యత ఎక్కువ అయ్యింది.

ప్రశ్న: మీ ఇంటి చిన్నబ్బాయి రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్నయ్య అయ్యారు…

చాలా సంతోషంగా ఉంది. ఎంత కష్టపడ్డాడో బిడ్డకు భగవంతుడు అంత మంచి అదృష్టం ఇచ్చాడు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది.

ప్రశ్న: జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికి పదేళ్లు గడిచింది. ఈ పదేళ్లలో ఇంటికి దూరంగా.. పీక్ లో ఉన్న కెరీర్ ను పక్కనపెట్టి రాత్రింబవళ్లు ప్రజల్లో ఉంటూ.. నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. తాగు నీరు కూడా దొరకని పాడేరు లాంటి ప్రాంతాల్లో తిరిగారు. అంత కష్టపడుతుంటే మీకు ఏమనిపించింది?

అలా తిరుగుతుంటే ఒక తల్లిగా బాధ కలిగింది.. అయితే ఇంట్లో అయినా అలాగే ఉంటాడు. ఎక్కడైనా పడుకుంటాడు. షూటింగులు చేసి వచ్చి సోఫాల మీద పడుకుని నిద్రపోయేవాడు. గదిలోనే పడుకోవాలి అని ఎప్పుడూ లేదు. కష్టపడతాడు. ఎంత కష్టపడినా ‘ఇంత కష్టపడ్డాను’ అని ఏనాడు చెప్పేవాడు కాదు. బిడ్డ అంత కష్టపడుతున్నాడే అని నాకు మాత్రం బాధగా ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా ఏమీ అడిగేవాడు కాదు. చిన్నప్పుడు కామ్ గా ఉండేవాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. భోజనానికి రమ్మని పిలిచినా వచ్చే వాడు కాదు. అంతా వచ్చిన తర్వాత ఆలస్యంగా వచ్చేవాడు. ఇది కావాలి.. అది కావాలి అని అడిగేవాడు కాదు.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ గారికి మీ చేతి వంటలో ఏది ఎక్కువ ఇష్టం?

పలావు అంటే బాగా ఇష్టం. ఏదైనా తింటాడు. పలావు అంటే కొంచం ఎక్కువ ఇష్టం. ఏదైనా చేసిపెడితే తినేవాడు తప్ప ఇది కావాలి. అది కావాలి అని అడిగేవాడు కాదు. ఏమీ అడగడు అని నేనే చేసి పెట్టేదాన్ని. చిన్నప్పటి నుంచి అంతే ఏమీ అడిగేవాడు కాదు.

ప్రశ్న: ఓ టీవీ ఇంటర్వూలో చూశాను.. చిన్నప్పడు ఇంట్లో టీవీఎస్ అడిగితే కొనిపెట్టలేదు. అందుకే ఇప్పుడు బైకులు ఎక్కువగా కొంటున్నాను అని చెప్పారు. నిజమేనా?

ఆ విషయం నాకు తెలియదు.

ప్రశ్న: ప్రజలంతా బాగుండాలన్న కాంక్షతో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా శ్రీ నరసింహస్వామి క్షేత్ర దర్శనాలు, వారాహి అమ్మవారి దీక్షలు, ఇప్పుడు శ్రీ వెంకటేశ్వరస్వామి క్షేత్రంలో జరిగిన లడ్డూ వ్యవహారంలో కూడా ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. 11 రోజుల పాటు ఈ దీక్ష చేట్టారు. దీన్ని మీరెలా చూస్తారు?

దీక్ష చేయడం మంచిదే. శ్రీ వెంకటేశ్వరస్వామి దీక్ష తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. దీక్షలు తీసుకోవడం మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి అలవాటే. అయ్యప్పస్వామి మాల వేసుకునేవాడు. ‘అయ్యప్ప దర్శనానికి నేను వెళ్లాలి నాన్నా..’ అని ఒకసారి అడిగితే నా కోసం అయ్యప్పస్వామి మాల వేసుకున్నాడు. 40 రోజుల తర్వాత వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాం. ఎప్పుడూ దీక్ష చేయడం ఇష్టమే. చిన్నతనంలో దైవ భక్తి ఉండేదిగాని దేవుడి దగ్గర దండాలు పెట్టేసి పూజలు చేసేవాడు కాదు. వాళ్ల నాన్న గారు పూజ చేసినా ప్రసాదం మాత్రమే తీసుకునేవాడు. ఇప్పుడు పెద్దయ్యాక పూజలు చేస్తున్నాడు.

ప్రశ్న: తిరుమలలో యోగ నారసింహస్వామి గుడి ఉంది కదా.. పవన్ కళ్యాణ్ గారి అన్నప్రాసన అక్కడే జరిగిందని విన్నాము. అందుకు సంబంధించిన వివరాలు చెబుతారా?

మేము ఒకసారి తిరుపతి దర్శనానికి వెళ్లాము. అప్పటికి కచ్చితంగా మా అబ్బాయికి ఆరో నెల వచ్చింది. ఆరో నెల వచ్చింది కదా ఇక్కడే అన్నప్రాసన చేసేద్దామని నాకు మనసులో అనిపించింది. శ్రీ వెంకట్రావు గారు పోలీసు అవడం వల్ల ఆ రోజుల్లో ఆయన దగ్గర ఎప్పుడూ చిన్నపాటి కత్తి ఉండేది. ఆ కత్తి, పెన్ను, పుస్తకాలు, దేవుడి ప్రసాదం పెట్టి యోగ నరసింహస్వామి వద్ద పడుకోబెట్టి చేసేద్దామండి అన్నాను. అంతకంటే అదృష్టం ఏముందని ఆయన అన్నారు. అన్నప్రాసన చేస్తే పవన్ ముందు కత్తి పట్టుకున్నాడు. తర్వాత పెన్ను పట్టుకున్నాడు.

ప్రశ్న: కత్తి పట్టుకోవడాన్ని ఎలా తీసుకున్నారు?

కత్తి పట్టుకున్నాడు కదా పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదంటే పది మందికీ ఏదో చేస్తాడు అని అప్పుడే అనుకున్నాను. కత్తిపట్టుకున్నాడు ఏదో చేస్తాడనుకున్నా.

ప్రశ్న: తర్వాత పెన్ను పట్టుకున్నదానికి ఏమనుకున్నారు?

పెన్ను పట్టుకున్నది రెండోసారి కదా. ప్రజల కోసం కష్టపడి పని చేస్తాడు అనుకున్నాను. వాళ్ల నాన్న గారు బాగా టూర్స్ వెళ్ళేవారు. ఆయన గుణాలే మా అబ్బాయికి ఉన్నాయి. కొంచం తిరగడం, కోపం ఆయనకి కూడా ఉండేవి.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారైన శ్రీ వెంకట్రావు గారి ప్రభావం చిన్నప్పటి ఆయనపై ఉండేదా?

చిన్నప్పటి నుంచి వాళ్ల నాన్న గారితో ఎక్కువగా ఉండేవాడు. వాళ్ల నాన్న గారిలా బుద్దిగా ఉంటాడు. తిండి గురించి ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు. ఎక్కువగా మాట్లాడడు. మితభాషి. అందుకే వాళ్ల నాన్నకి ఈ కొడుకు అంటే కొంచం ఎక్కువ ఇష్టం. అలా అని మిగతావాళ్ల మీద లేదు అని కాదు. చిన్నబ్బాయి ఇంట్లో కొంచం కామ్ గా ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. మాట్లాడితే మా చిన్నమ్మాయితో మాట్లాడేవాడు. ఈయన కంటే చిన్నది కాబట్టి ఆమెతో మాట్లాడేవాడు.

ప్రశ్న: అమ్మా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉండేవారా?

స్కూలులో ఎక్కువ లేదు. 10వ తరగతికి వచ్చేసరికి వాళ్లన్నయ్య క్లాస్మేట్ కి బుక్ లైబ్రరీ ఉంటే అక్కడికి వెళ్లి ఎక్కువ చదువుకునేవాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే చదువుకోవడానికి అనేవాడు అంతే. అలా పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. ఇప్పటికి కూడా చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని చదువుతున్నాడు. వాళ్ల నాన్న గారు పుస్తకాలు చదివేవారు. వాళ్ల నాన్న అలవాట్లే వచ్చాయి. ఇప్పుడు ఇంట్లో చూస్తే ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చదివే ఇన్ని ఆలోచనలు వచ్చాయేమో అనుకునేదాన్ని.

ప్రశ్న: పెద్దయ్యాక ఆయన ఏమవుతారో చిన్నప్పుడే ఏమైనా అనుకున్నారా?

నేను ఎవరి గురించి ఇది కావాలి. అది కావాలి అని అనుకోలేదు. వాళ్ల వాళ్ల అదృష్టాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ గారికి ఇంట్లో ఎవరితో ఎక్కువ అనుబంధం ఉండేది? చిరంజీవి గారితోనా? మిగిలినవాళ్లతోనా?

చిన్నప్పుడు వాళ్ల అన్నయ్యే బాగా దగ్గర తీసేవాడు. చిన్నవాడు కదా వాళ్లన్నయ్య ఎత్తుకుని ఫోటోలు తీసుకోవడం లాంటివి చేసేవాడు. తమ్ముడిని చాలా బాగా చూసుకునేవాడు. రెండో ఆయనకు ప్రేమ ఉన్నా మామూలుగానే ఉండేవాడు. ఎక్కువ చేరదీసింది మాత్రం పెద్ద కొడుకే. ఆయనతోనే ఎక్కువ ఉండేవాడు. ఇప్పటికీ వాళ్లన్నయ్య, వదినతోనే ఉంటాడు. మేము నెల్లూరులో ఉండేవాళ్లం. మాకు ఎక్కువగా ట్రాన్స్ ఫర్లు అయ్యేవి. పిల్లల చదువులు సరిగా ఉండవని కళ్యాణ్ బాబుని తీసుకువెళ్లి చదివిస్తాను అని చెప్పి మద్రాసు తీసుకువెళ్లిపోయాడు.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ గారికి మీరు చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణేనా?

              కాదు. శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాం. అది వెంకటేశ్వరస్వామి పేరు.

ప్రశ్న: అన్నప్రాసన చేసినప్పుడు కచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాడని అనుకున్నారు కదా? జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు అవుతుంది. అంత కంటే ముందు ప్రజారాజ్యం సమయంలో అన్నగారితో ఉంటూనే అప్పుడూ ప్రజల్లోనే మమేకమై ఉన్నారు. దాని కంటే ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థని స్థాపించారు. అప్పటికే సినిమాల్లో ఎదుగుతూ స్టార్ డమ్ వచ్చింది. పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరెలా భావించారు?

              పార్టీలు అవి మనకి ఎందుకు సినిమాలు చేసుకుంటే బాగుండును కదా అనిపించింది. దాని మీద ఆయనకి ఇష్టం ఉంది. మనం ఏమి చేస్తాం. అదీ, ఇదీ రెండూ చేస్తానమ్మా అని చెప్పాడు.

ప్రశ్న: ఈ విషయం మీద మీరెప్పుడైనా పవన్ కళ్యాణ్ గారితో వాదించారా?

నేనెప్పుడూ ఏ విషయం మీద వాదించేదాన్ని కాదు. వాళ్ల ఇష్టానికే వదిలేసేదాన్ని. వాళ్లు పెద్దవాళ్లు అయిపోయారు కదా. వారి ఆలోచనలు వారికి ఉంటాయి. మనకి అంత నాలెడ్జి ఏముంటుంది. వాళ్లకు తెలిసినంత మనకి తెలియదు కదా. అయితే ఎప్పుడైనా అడిగేదాన్ని. నాన్నా.. సినిమాలు చేసుకోవచ్చు కదా మనకి ఇవన్నీ ఎందుకు అని. రెండూ చేసుకుంటానని చెప్పేవాడు.

ప్రశ్న: శ్రీ చిరంజీవి గారు కూడా కొన్ని ఇంటర్వూల్లో ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైపోతారో అనుకున్నానని.. ఎక్కువగా పుస్తకాలు చదవడం, ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా దాని వైపు మొగ్గు చూపడం. అది చూశాక ఎక్కడ రెబల్ అయిపోతారోనని భయపడిన రోజులు ఉన్నాయని చెప్పారు?

మేము నెల్లూరులో ఉండే వాళ్లం కాబట్టి నాకు ఆ విషయం అంతగా తెలియదు. మద్రాస్ లో వాళ్లన్నయ్య దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆయనకే తెలుసు.

ప్రశ్న: ఇప్పుడు పదేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి కష్టపడ్డారు. డిప్యూటీ సీఎంగా.. ఆయన మార్క్ చూపిస్తున్నారు. మొన్న వరదలు వచ్చిన వెంటనే తక్షణం స్పందించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి పంచాయతీకి సొంత డబ్బు ఇచ్చారు. రాజకీయంగా ప్రతి అడుగులో ఆయన మార్క్ స్పష్టంగా కనబడుతుంది. ఇంతకు ముందు చాలా మంది రాజకీయ నాయకుల్ని చూసి ఉంటారు కదా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూస్తున్నారు?

ఇది వరకు రాజకీయాలు నాకు అంతగా తెలియదు. మా అబ్బాయి మంచి పనులు చేస్తున్నాడు. ప్రజలకు సేవ చేస్తున్నాడు సంతోషం. ప్రజలకు సేవ చేయాలి కదా. మనకున్నది మనం తినడం కాదు. నలుగురికి పెడితేనే కదా.. మనకి ఉంది కదా అని మనమే తినేస్తే ఎలా? ఇవాళ సహాయం అందని పరిస్థితుల్లో పాపం ఎంతో మంది అల్లాడుతున్నారు. మొన్న వరదలు వచ్చినప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది. కేరళలోని వయనాడ్ లో జరిగిన సంఘటన కూడా నాకు ఎంతో బాధ కలిగింది. జనం అల్లాడిపోయారు. చంటి బిడ్డలు వాళ్లు ఎంత ఇబ్బంది పడిపోయి ఉంటారని ఊహించుకుంటే ఎంతో బాధగా అనిపించేది. వార్తల్లో చూస్తుంటే చాలా బాధ కలిగేది. అలాంటి వాళ్లకు సాయం చేయాలి. తప్పదు. మన శక్తి కొద్ది మనం వాళ్లకి సహాయం చేస్తే మంచిదే కదా.

ప్రశ్న: మీరు అనుకున్నట్టు సెలబ్రిటీగా సినిమాలు చేసుకుంటూ ఉంటే ఏదో తనవంతు విరాళం ఇచ్చేసి వదిలేసేవారు. రాజకీయాల్లోకి వచ్చాక క్షేత్ర స్థాయిలో ఆయనే దగ్గరుండి ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చూసుకుంటున్నారు. దీన్ని మీరెలా చూస్తారు?

మంచిదే. అందరికీ సహాయం చేయడం అనే ఆలోచన అందరికీ రావాలి కదా. సేవాగుణం ఉంటేనే కదా అలా చేసేది. వాళ్ల నాన్న గారికి కూడా సేవాగుణం ఉండేది.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం మొత్తం చూస్తే సినిమా కెరీర్, రాజకీయాల్లో వారి తండ్రి గారి ప్రభావమే ఎక్కువ ఉండేదా? ఇంకా ఎవరి ప్రభావం అయినా ఉండేదా?

మా అబ్బాయిపై వాళ్ల నాన్న గారి ప్రభావమే ఎక్కువగా ఉండేది. ఆయన కూడా ఇలాగే దానధర్మాలు చేసి ఎదుటివారికి సహాయం చేసే వారు. అదే గుణం ఈయనకీ వచ్చింది. ముగ్గురికీ ఆ గుణం ఉంది. పవన్ కి కొంచం ఎక్కువ. సినిమాల్లో చేసేప్పుడు కూడా అందరికీ సాయం చేసేవాడు.

ప్రశ్న: ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా చూస్తున్నారు. మీ అబ్బాయిని భవిష్యత్తులో ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? జాతీయ స్థాయిలో కూడా ఆయన ముద్ర ఉంది.. బీజేపీతో ప్రయాణం కావచ్చు.. దైవ చింతన ఇవన్నీ కలగలిసిన పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తుంది. ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగాలని ఆలోచిస్తున్నారా?

నాకు ఎలాంటి ఆశలు లేవు. దేవుడు ఎలా చేస్తే అలా జరుగుతుంది. దేవుడు రాత ఎలా రాస్తే అలా జరుగుతుంది. ఇంకా పెద్ద స్థాయికి వస్తే మరింత సంతోషం. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి అవుతాడని అనుకోలేదు కదా. మనం అనుకున్నవన్నీ జరగవు. భవగంతుడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు.

ప్రశ్న: పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారైన శ్రీ వెంకట్రావు గారి గుణాలే ఆయనకి వచ్చాయని చెప్పారు. చిన్నప్పుడు తండ్రి గారితో ఆయనకు ఎలాంటి అనుబంధం ఉండేది?

తండ్రితో బాగా ఉండేవాడు. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా పట్టుదలతో ఉండే వాడు. ఏదైనా చేయాలనుకుంటే చేసేస్తాడు. మా అమ్మగారి ఊరు మొగల్తూరు. ఒకసారి అందరం వెళ్దామనుకున్నాం. ఇతరత్రా కారణాలతో ఆ ప్రయాణం మానుకోవాల్సి వచ్చింది. అప్పుడు మా అబ్బాయి వెళ్లాల్సిందే అని వాళ్ల నాన్న గారి వద్ద పట్టుబట్టాడు. చెబుతుంటే వినేవాడు కాదు. ఇప్పుడు వద్దు నాన్న అని చెప్పినా వినిపించుకోలేదు. అప్పుడు వాళ్ల నాన్న గారు కొట్టారు. అప్పుడు మానేశాడు. పట్టుదల బాగా ఎక్కువ. ఇది చేయాలి అంటే చేసేసేవాడు. ఇప్పుడూ అదే పట్టుదల వచ్చింది. ఏదైనా చేయాలనుకుంటే చేసేస్తాడు.

ప్రశ్న: చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా విమానం ల్యాండింగ్ కి అనుమతి ఇవ్వకపోతే రోడ్డు మార్గంలో వచ్చేశారు?

మా అబ్బాయి రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకు ఇంత కష్టం… రోడ్డు మీద పడుకోవాలా అనిపించేది. విజయం చూశాక సంతోషం కలిగింది. భగవంతుడు కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చాడు అనుకుంటాను. కష్టపడ్డాడు.. భగవంతుడు మంచి జీవితం ఇచ్చాడు. చెప్పాలంటే ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ కష్టం ఇచ్చాడు. బాధ్యతను మోయడమే అన్నింటికంటే ఎక్కువ కష్టం కదా. పదవులు రాగానే సరి కాదు. బాధ్యతగా వాటిని నిర్వర్తించాలి.

ప్రశ్న: థాంక్యూ అమ్మా… పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటున్నాము…

సంతోషం. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు మంచి వృద్ధిలోకి రావాలనే కోరుకుంటారు కదా. నేను అదే కోరుకుంటున్నాను.