నాకు స్ఫూర్తిప్రదాత చిరంజీవి గారి జన్మదినం.. అభిమానులందరికీ పండుగ రోజు. చిరంజీవి గారంటే కేవలం ఒక మెగాస్టార్ కాదు. మూర్తీభవించిన స్ఫూర్తి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా ‘పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడడం’ అనే జీవనవేదానికి చిరంజీవిగారి ప్రస్థానం నిదర్శనం. కలలు సాకారమై, శిఖరాలను అధిరోహించిన తర్వాత.. నిగర్వంగా, నిరాడంబరంగా ఉండడం.. తన మూలాలను మరచిపోని స్పృహతో ఉండడం… లాంటి జీవన విలువలకు ప్రతీక. చిరంజీవి గారు.. తానే ఒక సందోహం… తన జీవితమొక సందేశం!
ఆ సందేశాన్ని అందిపుచ్చుకున్న లక్షల మంది యువతరంలో నేనొక పరమాణువును కావడం అదృష్టం. అంతకుమించి, ఆయన తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం.
అన్నయ్య చిరంజీవి గారు నరసాపురంలో విద్యార్థిగా ఎన్సీసీలో ఉన్ననాటి నుంచి… మద్రాసులో యాక్టింగ్ విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి.. ఇవాళ్టి వరకు అదే ఉక్కు క్రమశిక్షణ. అదే స్థాయిలో అనితర సాధ్యమైన నేర్చుకునే తత్వం. అసామాన్యమైన తన ప్రస్థానంలో ఎన్నెన్ని ఎదురుదెబ్బలు, కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా.. పట్టుదలతో వాటిని తొక్కేసుకుంటూ.. ఉన్నత శిఖరాలకు ఎగబాకిన ధీరత్వం… చిరంజీవిగారి సొంతం. ఆయన వేసే ప్రతి అడుగు ఆదర్శం, అనుసరణీయం.
ఇవాళ… యావత్ భరతజాతి విస్మరించిన అస్తుత సమరాగ్రేసరుడు.. అగణ్య ధీరాగ్రేసరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని… ఆసేతుహిమనగమూ భళీ భళీయని ప్రతిధ్వనించేలాగా.. ‘సైరా’ అంటూ సినీప్రియులకు కానుకగా అందిస్తున్న చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా తరఫున, జనసైనికుల తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి. ఆయన జీవితం.. మరింత మందికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉండాలని కోరుకుంటున్నాను.
ఆకాశం ఎప్పటికీ అలా నిశ్చలంగా, నిర్లిప్తంగా ఉంటుంది. కానీ దాని వలన గాలి అష్టదిక్కులకూ విస్తరిస్తుంది. చిరంజీవిగారు మౌనిగా, మునిగా సుస్థిరంగా ఉంటారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నవతరాలను తీర్చిదిద్దుతూనే ఉంటుంది.