ఇద్దరు గొప్ప దర్శకుల మధ్య సంభాషణలు ఇవి – “భారత్‌బంద్”

ఇద్దరు ప్రముఖులు కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారనేదానికంటే వాళ్ళిద్దరిమధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది అనే వార్తపైనే జనానికి ఉత్సుకత ఎక్కువ. ఆ వార్త ఊహాజనితమైనదైనా దానికి ఎవరివంతువారు కొత్తబట్టలు తొడిగిమరీ ఊరేగించటంలో అదో తుత్తి.

“భారత్‌బంద్” సినిమా తీస్తున్న రోజుల్లో(నేను అసోసియేట్ డైరెక్టర్)ఓ పుకారు విపరీతంగా వ్యాపించింది. ఆ సినిమా తీయటం దాసరి గారికి అస్సలు ఇష్టం లేదనీ, వద్దని వారించినా శిష్యుడు లెఖ్ఖ చేయకుండా తీస్తున్నాడనీ, అందుకే ప్రారంభోత్సవానికి కూడా ఆయన రాలేదనీ, గురుశిష్యుల మధ్య పెద్ద యుధ్ధమే నడుస్తుందనీ విపరీతంగా చెప్పుకొనేవారు.

కట్ చేస్తే “భారత్‌బంద్” సినిమా షూటింగ్ జూబిలీహిల్స్ లోని ఓ ఇంట్లో జరుగుతుండగా సడెన్ గా దాసరిగారు ఎంట్రీ. ఆ దగ్గరలోనే వారి షూటింగ్ జరుగుతుందట. మా గురువుగారు పరుగున ఎదురువెళ్ళి వాళ్ళ గురువుగారి కాళ్ళకి నమస్కారం చెయ్యటం ఆయన శిష్యుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటం జరిగిపోయింది.

“ఏంటయ్యా రామకృష్ణా నీకూ నాకూ ఏవో గొడవలట అవేంటో నీకేమైనా తెలుసా” అన్నారు దాసరిగారు నవ్వుతూ. “ఏమో సార్ రోజుకో కొత్త గొడవ చెప్తున్నారు.చాలా క్రియేటివ్ గా వున్నారు”అన్నారు కోడిరామకృష్ణ గారు.

దాసరిగారు సినిమా కధ అడిగి తెలుసుకున్నాక షాట్ తియ్యవయ్యా అని కూర్చున్నారు. ఆయనముందు షాట్ తియ్యటానికి చిన్నపిల్లాడిలా సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతున్నారీయన. ఆ దృశ్యం భలేగమ్మత్తుగా అనిపించింది అక్కడున్నవారందరికీ. ఎందుకంటే అప్పటికే 49 చిత్రాలుతీసిన దర్శకుడు కోడిరామకృష్ణ గారు.

“మంచి టైటిల్ పెట్టావ్ ఎలా చేస్తున్నావో చూద్దామని నేనొస్తే షాట్ తీయటానికి సిగ్గుపడతావే… నీ డైరెక్షన్ చూసిగానీ నేను వెళ్ళను “అని నవ్వారు దాసరి గారు.
అప్పుడు ఆయన ముందే బాబూమోహన్ గారికి ఎలా నటించాలో చేసి చూపించి టేక్ చేశారు మా గురువుగారు.

“రామకృష్ణ చేసిచూపించినదానిలో సగం నటిస్తేచాలు మీకు మంచి పేరు వస్తుంది” అని నటులతో చెబుతూ కితాబిచ్చారు దాసరి గారు. తర్వాత ఆయనతో అందరం ఫోటోలు దిగాము. ఆయన వెళుతూ “ఆ ఫోటోలు ప్రెస్ కి కూడా ఇవ్వండి.అవి చూశాక కూడా ఏం కధలల్లుతారో చూద్దాం” అని నవ్వుతూ వెళ్ళారాయన బ్రహ్మానందం గారితో కలిసి.

సినిమావాళ్ళ బెడ్‌రూముల్లోనే వాళ్ళుకూడా కాపురమున్నట్లు అన్నీ తాము చూసినట్టే చెప్పేవాళ్ళు ఇప్పుడేకాదు అప్పుడూ వున్నారు. కాకపోతే అప్పుడు వాళ్ళ పేరు “సీనియర్ జర్నలిస్ట్” కాదు అంతే. ఏదిఏమైనా మా గురువుగారికి వాళ్ళ గురువుగారిపైనున్నంత భక్తి నేనైతే మరే శిష్యుడి దగ్గరా చూడలేదు. ఇది నిజం.