ప్రముఖ సంగీత దర్శకుడు, మాస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజాకు చెన్నయ్ హైకోర్టులో చుక్కెదురైంది. గత కొంతకాలంగా ఆయన తన సినిమా పాటలకు సంబంధించిన కాపీరైట్ కోసం చెన్నై హైకోర్టులో పోరాడుతున్నారు. ఇళయరాజాకు చెందిన నాలుగువేల పై చిలుకు పాటలను ఉపయోగించుకునేందుకు గతంలో మ్యూజిక్ కంపెనీలు ఎకో, ఏఐజీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఒప్పంద సమయం పూర్తయిన తర్వాత కూడా ఆ యా సంస్థలు తన పాటలను వాడుకుంటున్నాయని, రాయల్టీ ఇవ్వడం లేదని ఇళయరాజా అప్పట్లో ఒక పిటిషన్ వేశారు. దానిని పరిశీలించిన కోర్టు ఆ పాటలపై హక్కు సదరు చిత్ర నిర్మాతలకు ఉంటుంది తప్పితే, సంగీత దర్శకుడు కు ఉండదని 2019లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా అప్పీల్ దాఖలు చేశారు. దానిని విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఇళయరాజా పాటలను సంగీత సంస్థలు వాడుకోకుండా మధ్యంతర నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఏప్రిల్ 24న విచారణకు వచ్చింది.
ఎకో సంస్థ తరఫున హాజరైన న్యాయవాదులు ‘సంగీతం సమకూర్చినందుకు ఇళయరాజాకు నిర్మాతలు అప్పుడే పారితోషికం ఇచ్చేశారని, కాబట్టి వాటిపై ఆయనకు ఏ మాత్రం హక్కులు ఉండవని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు కొత్త సందేహాన్ని వ్యక్తం చేశారు. నిజానికి లిరిక్స్ లేకపోతే సినిమాలో పాటలకే ఆస్కారం ఉండదని ఒకవేళ రేపు గీత రచయితలు కూడా తమ హక్కుల గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని అడిగారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు, విచారణను జూన్ రెండో వారానికి వాయిదా వేశారు. ఒకవేళ కోర్టు తీర్పు మ్యూజిక్ కంపెనీలకు అనుకూలంగా వస్తే… గతంలో వారు ఇళయరాజాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ సైతం వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటుంది. మొత్తానికి మాస్ట్రోకు చెన్నయ్ హైకోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలింది.