ప్రముఖ నిర్మాత, సినిమా కార్మిక సంఘ నాయకురాలు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు , దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి అర్ధాంగి శ్రీమతి దాసరి పద్మ గారి 10వ వర్ధంతి . తెలుగు సినిమా రంగంలో పద్మ గారు దాసరి నారాయణ రావు గారి భార్య గా మాత్రమే కాదు సినిమా రంగ కార్మిక సంఘాల నాయకురాలుగా , తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుపరిచితురాలు.
దాసరి నారాయణ రావు గారు దర్శకులుగా ఎదిగే క్రమంలో పద్మ నిర్వహించిన పాత్ర , ఆమె ముందు చూపు , ఆమె తెగువ , మంచితనం అన్నీ ఆ ఇద్దరినీ విజయపధంలో నడిపించాయి .
దాసరి నారాయణ రావు గారు నిర్మాతగా అనేక చిత్రాలను నిర్మించారు , ఆ చిత్రాలకు నిర్మాత పద్మ గారే. దాసరి సినీ చిత్ర, తారక ప్రభు ,సౌభాగ్య ఇంటర్నేషనల్ మొదలైన సంస్థలు పద్మ గారికి నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు , అవార్డులు తెచ్చిపెట్టాయి . ఈ దంపతులకు హరి హర ప్రభు, అరుణ్ కుమార్ , హేమాలయా కుమారి ముగ్గురు సంతానం. .
దాసరి నారాయణ రావు గారికి అన్ని విధాలుగా తోడు నీడగా ఉంటున్న పద్మ గారు ఆనారోగ్యతో అక్టోబర్ 28, 2011లో కన్నుమూశారు . పద్మగారు భౌతికంగా దూరమై ఇప్పటికి 10 సంవత్సరాలు . ఆమె వర్ధంతి సందర్భగా కుమార్తె హేమాలయా కుమారి అల్లుడు డాక్టర్ రఘునాథ బాబు , మనుమలు ధనుష్ కుమార్, గగన్ కుమార్ చేవెళ్ల సమీపంలోని పద్మ గారి సమాధి సందర్శించి నివాళులర్పించారు . పద్మగారి వర్ధంతి సందర్భగా దాసరి నారాయణ రావు , శ్రీమతి పద్మ గారి ఘాట్ ను పూలతో అలంకరించారు .
అనంతరం పద్మ గారి పేరు మీద “ది నెస్ట్ ” అనే వృద్దాశ్రమానికి వెళ్లి అందరికీ భోజనం వడ్డించారు .ఆప్యాయంగా తమకు అన్నం పెట్టిన హేమాలయా కుమారి , ధనుష్ కుమార్, గగన్ కుమారులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు . .