తెలుగు చలనచిత్ర రంగంలో మొదటి తరం ప్రముఖుల్లో ఒకరు , దర్శక నిర్మాత , స్క్రీన్ ప్లే రైటర్. శ్రీ ఉప్పలపాటి విశ్వేశ్వర్రావు గారు గత కొంతకాలంగా వయసురీత్యా అనారోగ్యంతో ఉండి ఇప్పుడు శివైక్యం చెందారు. ఆయన వయసు 93 సంవత్సరాలు.
విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ లో 25 చిత్రాలు నిర్మించారు.పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరికొన్ని చిత్రాలకు స్క్రీన్ ప్లే రచించారు.
కమ్యూనిస్టు భావాలతో సినిమారంగంలోకి అడుగుపెట్టారు. కంచుకోట, తీర్పు, మార్పు, పెత్తందార్లు , దేశోద్ధారకులు లాంటి ఎన్నో మంచి సినిమాల నిర్మాతగా కీర్తి గడించారు. తెలుగువాళ్లందరూ ఒక తాటిమీద వుండాలని ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు.
ఆయనకు 2 నేషనల్ అవార్డ్స్ , 2 నంది అవార్డులు వచ్చాయి. ఆయన దర్శకత్వం వహించిన నగ్నసత్యం (1979) , హరిశ్చంద్రుడు(1980) చిత్రాలకు జాతీయ స్థాయిలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డులు లభించాయి. ఆయన దర్శకత్వం వహించిన కీర్తి కాంత కనకం (1982) చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు లభించింది.
ఉప్పలపాటి విశ్వేశ్వర్రావు గారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు సెక్రటరీగా కొంతకాలం వ్యవహరించారు. 17 వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కి సెంట్రల్ జ్యురీ మెంబర్ గా , నంది అవార్డ్స్ జ్యురీ మెంబర్ గా వ్యవహరించారు.
కృష్ణా జిల్లా , ముదినేపల్లి మండలం , గురజ ఆయన స్వగ్రామం. ఆయన బాల్యంలోనే వారి కుటుంబం ముదినేపల్లి మండలం గోగినంపాడులో స్థిరపడింది. అనంతరం ఆయన మద్రాస్ (చెన్నై) వెళ్లి చలనచిత్ర రంగంలో అడుగుపెట్టి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
వీరి సతీమణి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సొంత బాబాయ్ నందమూరి నాగయ్య గారి కుమార్తె. ఎన్టీఆర్ గారు , ఈయన వియ్యంకులు. వీరు నందమూరి మోహనకృష్ణ గారికి మామగారు. నందమూరి తారకరత్నకి తాతగారు. టిడిపి నాయకురాలు మాగంటి రూప గారు వీరికి మనుమరాలు . రూప గారి తల్లిగారు విశ్వేశ్వర్రావు గారి అమ్మాయి.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ పెద్దాయనకు అశ్రు నివాళి.
ఓం శాంతి