Tollywood: నూతన్ ప్రసాద్ అనగానే గుర్తొచ్చేది నూటొక్క జిల్లాల అందగాడిని.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనే డైలాగ్‌లు ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల్లో మెదులుతూనే ఉంటాయి. విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం పొందిన ఈ నూటొక్క జిల్లాల అందగాడు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, ఏ పాత్ర పోషించినా ప్రాణం పోసేవారు.. కాగా నూతన ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులు ఆర్పించారు. ఆయన 10వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని స్మృతులను గుర్తు చేసుకుందాం..
నూతన్ ప్రసాద్ పూర్తి పేరు తడినాధ వరప్రసాద్. 1950సం,,లో అక్టోబర్ 10న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు. ప్రభుత్వ ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన సినిమాలపై ఉన్న మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి వచ్చారు.. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు సినిమాతో ఆయన సినీ తెరంగేట్రం చేశారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ముత్యాల ముగ్గు సినిమాతో తొలి గుర్తింపు లభించింది. ఎన్టీఆర్, ఎఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి అగ్రహీరోలతో నటించిన ఆయన ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాజేంద్రప్రసాద్‌లతో కూడా కలిసి నటించారు… ఇక ఆయనకు 1984లో నంది అవార్డు, ఎన్టీఆర్ జాతీయ అవార్డు వరించాయి. 1989లో తన 53వ చిత్రం బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదవశాత్తు తన రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు. అయినా ఆయన తన సినీ ప్రస్థానాన్ని ఆపలేదు. ఇక తాను నటించిన చివరి చిత్రం 2000లో ఆవారాగాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2011 మార్చి 30వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇప్పటికీ నూటొక్క జిల్లాల అందగాడు ఎవరంటే ఆయన పేరే గుర్తుకు వస్తుంది. నేడు మన మధ్య ఆయన లేకపోయినా ఒక నటుడిగా, హాస్య చతురుడిగా మన మదిలోనే ఉంటాడు.