టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అనగానే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి అని ఎవరైనా చెబుతారు. టాలీవుడ్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన సినిమాగా ఇది నిలిచి తెలుగువారందరూ గర్వపడేలా చేసింది. ఈ సినిమా తర్వాత భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలను నాన్ బాహుబలి రికార్డుల పేరిట పిలుస్తున్నారు.
గత సంవత్సరం ఇదే రోజున విడుదలైన అల వైకుంఠపురములో సినిమా టాలీవుడ్లో నాన్ బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టింది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. ఇందులో పాటలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. యూట్యూబ్ రికార్డులను షేక్ చేశాయి. USA బాక్సాఫీస్ దగ్గర అత్యధిక గ్రాస్ సంపాదించిన సినిమాగా అల వైకుంఠపురములో నిలిచింది.
ఇక డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లలో ఎక్కువమంది చూసిన సినిమాతో పాటు బుల్లితెరపై అత్యధికంగా 29.4 టీఆర్పీ రేటింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. టాలీవుడ్లో రూ.200 కోట్లుపైగా కలెక్షన్లను ఈ సినిమా సాధించింది. సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా సినిమా యూనిట్ నిన్న రాత్రి రీయూనియన్ ఫంక్షన్ నిర్వహించింది.