ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఒక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని జూహూ పరిసర ప్రాంతంలో తనకు ఉన్న ఒక భవనాన్ని లాక్డౌన్లో సోనూసూద్ హోటల్‌గా మార్చారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా బస కల్పించడంతో పాటు భోజన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ప్రైవేట్ భవనాన్ని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా హోటల్‌గా మార్చారని ముంబై కార్పొరేషన్ సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో సోనూసూద్‌కి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశముందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై ట్విట్టర్లో సోనూసూద్ స్పందించాడు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే తన ప్రైవేట్ భవనాన్ని హోటల్‌గా మార్చామని తెలిపాడు. మహారాష్ట్ర కోస్టల్ అథారిటీ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతులు తప్ప మిగిలిన అన్ని సంస్థల అనుమతులు తీసుకున్నామన్నారు.
మహారాష్ట్ర కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతులను తీసుకునేలోపే లాక్డౌన్ విధించారని, అనుమతలు కోసం ఆలస్యం అయిందని సోనూసూద్ వివరణ ఇచ్చాడు.