కరోనా ప్రభావం తగ్గడంతో లాక్డౌన్ తర్వాత 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు నడుపుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి మంజూరు చేశాయి. దీంతో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం 50 శాతం ఆక్యూపెన్సీతో దేశవ్యాప్తంగా థియేటర్లు రన్ అవుతున్నాయి. కానీ తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. దీనిపై తమిళ సినిమా నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కానీ కొంతమంది మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కోలీవుడ్ నటుడు అరవింద్ స్వామితో పాటు పలువురు సినీ ప్రముఖులు దీనిని వ్యతిరేకించారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన అరవింద్ శ్రీనివాస్ అనే డాక్టర్ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. కొందరి దురాశ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందిని ప్రమాదంలోకి నెట్టబోతోందని, ఇప్పటివరకు వైద్యులతో పాటు ఇతర రంగాల వారు పడిన కష్టాన్ని బుగ్గిపాలు చేస్తుందని ఫైర్ అయ్యారు.
తనలాంటి వైద్యులు అందరూ అలసిపోయారని, పోలీసు అధికారులు అలసిపోయారు. శానిటరీ కార్మికులు అలసిపోయారు. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ చేయాలని తామంతా కష్టపడుతున్నామన్నారు. వంద శాతం థియేటర్ ఆక్యుపెన్సీ ఆత్మహత్యాసదృశం. దీనికి బదులుగా నరమేధం చేస్తే సరిపోయేదని డాక్టర్ తన లేఖలో రాశారు.