సూపర్‌స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆశ్రమ్ స్కూల్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆమెకు తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లతా రజనీకాంత్ స్థానిక గిండి ప్రాంతంలో వెంకటేశ్వర్లు, పూర్ణ చంద్రరావులకు చెందిన స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆశ్రమ్ పేరుతో ఒక స్కూల్‌ను రన్ చేస్తోంది. అయితే రజనీకాంత్‌కు ఆశ్రమ్ స్థల సొంతదారులకు మధ్య అద్దె విషయంలో చాలా కాలంగా వివాదం జరుగుతోంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో స్థలాన్ని ఖాళీ చేయడానికి లతా రజనీకాంత్ అంగీకరించారు.
కానీ ఇప్పటికీ స్కూల్‌ను అక్కడి నుంచి తీసివేయకపోవడంపై గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతుండగా.. స్కూల్‌ని ఖాళీ చేయాలని తాజాగా లతా రజనీకాంత్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలా చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసులో చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హైకోర్టు పేర్కొంది.
ఈ నోటీసులపై లతా రజనీకాంత్ స్పందించారు. తాను ఎలాంటి కోర్టు ధిక్కారానికి పాల్పడలేదని తెలిపారు. ‘కరోనా క్రమంలో విద్యాసంస్థ ప్రాంగణాన్ని ఖాళీ చేయవద్దని హైకోర్టు అనుమతి కోరాం. దీంతో 2021 ఏప్రిల్ వరకు ఉండటానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ పాఠశాల ప్రస్తుత ప్రాంగణంలో ప్రవేశాలు తీసుకోకూడదు. తాము ఎటువంటి బకాయిలు లేకుండా ప్రాంగణానికి అద్దె చెల్లిస్తున్నాం అని లతా రజనీకాంత్ తెలిపారు.