డ్రగ్స్ కేసులో కన్నడ సినీ నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీలకు బెయిల్ ఇవ్వడానికి కర్ణాటక హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ఈ కేసులో మరో నలుగురి బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ తోసిపుచ్చారు, చిత్రనిర్మాత శివప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌కి కూడా షాక్ తగిలింది. మాదకద్రవ్యాల కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) సెప్టెంబరులో రాగిని ద్వివేది, సంజన గల్రానీలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కీలక సూత్రధారి శివ ప్రకాష్ ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నటీమణులు, మాదకద్రవ్యాల సరఫరాదారు ప్రశాంత్ రాంకాలను సెప్టెంబర్ 13న సిసిబి కస్టడీలోకి తీసుకుంది , తరువాత సెప్టెంబర్ 14 న జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. ప్రశాంత్‌కు కూడా బెయిల్ నిరాకరించారు. అప్పటి నుండి ఆయన ఇక్కడ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. మలయాళ సీరియల్ నటి అనిఖా, బినేష్ కొడియారి సహచరుడు మహ్మద్ అనుప్ సహా ముగ్గురు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సింథటిక్ మాదకద్రవ్యాలతో అరెస్టు చేయడంతో ప్రముఖుల మధ్య మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నగర పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ముగ్గురిపై కన్నడ సినీ నటులు, గాయకులతో సహా బెంగళూరు ప్రముఖులకు మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.