నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు సినీ సేవలు చిరస్మరణీయం – ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, ఎండీ విశ్వనాథన్, బోర్డు సభ్యుల ఘన నివాళి

భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ నటుడు నానా పటేకర్, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఘనంగా నివాళులర్పించింది.

గురువారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ లోని ఆర్టీసీ ప్రధాన హాల్‌లో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. భరత్ భూషణ్, మేనేజింగ్ డైరెక్టర్ కే. విశ్వనాథన్, బోర్డు సభ్యులు పాల్గొని నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏపీ FDC చైర్మన్ భరత్ భూషణ్, ఎండీ, బోర్డు సభ్యులు సమావేశంలో చర్చిస్తూ.. భారతీయ సినీ రంగానికి నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నటుడిగా నానా పటేకర్ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. విభిన్న పాత్రలను అత్యంత సహజంగా పోషిస్తూ భారతీయ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.

అదేవిధంగా దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినీ పరిశ్రమకు వినూత్నమైన, ప్రయోగాత్మక చిత్రాలను అందించి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన సృజనాత్మకత, దర్శకత్వ ప్రతిభ తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకు కూడా విశేష గుర్తింపు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

సినీ రంగంలో నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు అందించిన సేవలు, వారి ప్రతిభ, కృషి భవిష్యత్ తరాల సినీ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని భరత్ భూషణ్ అన్నారు. భారతీయ సినిమా అభివృద్ధికి వారు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

కార్యక్రమంలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు, బోర్డు సభ్యులు, సినీ రంగ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles