మంచి స్పందన పొందుతున్న ‘నీతో ఓ అడుగు’ గీతం – డిసెంబర్ 11న చిత్రం విడుదల

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మాణంలో రాధిక జయంతి తెరకెక్కించిన చిత్రం ‘రాయవలస’. ఈ మూవీలో కార్తీక్, శ్రీష నులు జంటగా నటించారు. కార్తీక్ హీరోగా, రచయితగా, సింగర్‌గా ఈ సినిమాతో తనలోని మల్టీ టాలెంట్‌ను చూపించబోతోన్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా వదిలిన ప్రేమ గీతం యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది.

‘నీతో ఓ అడుగు’ అంటూ సాగే ఈ పాటకు హీరో కార్తీక్ స్వయంగా సాహిత్యం అందించడమే కాకుండా, తన గాత్రంతో ఆలపించడం విశేషం. నటన, పాటల రచన, గానం వంటి విభిన్న కళల్లో ప్రతిభ చూపించే హీరోలు సినీ పరిశ్రమలో అరుదుగానే కనిపిస్తుంటారు. అలాంటి బహుముఖ ప్రతిభతో కార్తీక్ తన తొలి చిత్రంతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రముఖ గాయని రమ్య బెహరా తన మధురమైన, సున్నితమైన గాత్రంతో పాటకు మరింత ఆకర్షణను తీసుకు వచ్చారు. అర్జున్ బాల అందించిన మెలోడీయస్ ట్యూన్, కార్తీక్–రమ్య బెహరా గాత్రం పాటను చార్ట్ బస్టర్‌గా నిలబెట్టాయి. లిరికల్ వీడియోలో రాధిక జయంతి మేకింగ్, టేకింగ్ కనిపిస్తోంది. ముఖ్యంగా బీచ్ నేపథ్యంలో చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు, సహజమైన ప్రేమ భావనలు 90ల నాటి మధురమైన ప్రేమ గీతాలను గుర్తుచేస్తున్నాయి. సాధారణంగా సముద్ర తీరంలో చిత్రీకరించిన ప్రేమ గీతాలు ఎప్పుడూ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి.

సినిమాటోగ్రాఫర్ కిట్టు తన అద్భుతమైన కెమెరా పనితనంతో ప్రతి ఫ్రేమ్‌ను ఒక అందమైన చిత్రంలా తీర్చిదిద్దారు. రాజ్ పైడే అందించిన సున్నితమైన కొరియోగ్రఫీ, హీరో హీరోయిన్ల మధ్య అందమైన రొమాంటిక్ మూమెంట్స్ పాటలోని ప్రేమ భావనను మరింత పెంచాయి.

‘రాయవలస’ పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘రింగుడు రింగుడు’, ‘జాతర’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు వాటికి పూర్తి భిన్నంగా ఒక క్లాసీ రొమాంటిక్ మెలోడీతో చిత్రబృందం ముందుకొచ్చింది. తాజాగా విడుదలైన ఈ ప్రేమ గీతానికి కూడా మంచి స్పందన లభిస్తోంది.

పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, భావోద్వేగాల కలయికతో తెరకెక్కుతున్న ‘రాయవలస’ డిసెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదల కానుంది. తొలిసారిగా సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ, ‘రాయవలస’ చిత్రబృందం విడుదలకు ముందే ఒక కీలక మైలురాయిని అందుకుంది. ఆంధ్రా, నైజాం ప్రాంతాలతో పాటు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ డీల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ హక్కులను సినీ గోల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకోవడం విశేషం. తొలి చిత్రంతోనే స్వదేశీ, విదేశీ మార్కెట్లలో డిస్ట్రిబ్యూషన్‌ను ఖరారు చేసుకోవడం నిర్మాత గోపి కృష్ణ జయంతి, దర్శకురాలు రాధిక జయంతి విజన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రాయవలస’పై చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉంది.

Related Articles

Latest Articles