బిగ్ బాస్ ఇంట్లో తన పనితీరుతో ప్రేక్షకుల హృదయాలకు మరింత దగ్గరైన 59 ఏళ్ల యూట్యూబ్ సంచలనం గంగవ్వ దురదృష్టవశాత్తు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇటీవల షో నుంచి తప్పుకున్నారు. ఒక విధంగా ఆమె అభిమానులకు ఈ విషయం చాలా నిరాశకు గురి చేసింది. అంతే కాకుండా అభిమానులు గంగవ్వ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే ప్రస్తుతం గంగవ్వ బాగానే ఉందని ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున చింతించాల్సిన పనిలేదని మై విలేజ్ షో టీమ్ తెలియజేసింది. ఆమె డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారని కొన్ని రోజుల పాటు ఆమెకు విశ్రాంతి ఇవ్వమని సలహా ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఓ వర్గం అభిమానులు గంగవ్వ త్వరగా కోలుకొని మై విలేజ్ షో ద్వారా మళ్ళీ అందరిని ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో జోర్దార్ సుజాత ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. ఇక గంగవ్వ సొంత నిర్ణయంతో హౌజ్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆమె స్థానంలో మరొకరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.