
తెలుగు సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ కు రీచ్ కావాలని, నిర్మాతగా తాను అదే కోరుకుంటానని అన్నారు ప్రొడ్యూసర్ బన్నీ వాస్. ఆయన హైదరాబాద్ లో జరిగిన ఏకం బిజినెస్ కాన్ క్లేవ్ లో అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 300 మంది వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ప్రొడ్యూసర్ బన్నీవాస్ మాట్లాడుతూ – మన జీవితంలో కష్టం సుఖం ఎలా ఉంటాయో సినిమా బిజినెస్ లోనూ లాభాలు, నష్టాలు సహజం. ఈ రోజు నేను పోగొట్టుకుంటే రేపు సంపాదిస్తాననే నమ్మకంతో ముందుకు వెళ్తుంటాం. మిగతా వ్యాపారాలు కొన్నేళ్లకు బోర్ కొడుతుంటాయి. కానీ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు ఏ రోజూ విసుగురాదు. ప్రతి రోజూ ఒక కొత్త ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తాం. నేను ఆర్య సినిమా డిస్ట్రిబ్యూషన్ లో సక్సెస్ అయ్యాక ఇక మనం ఇక్కడ రాణించగలం అనే ఆత్మవిశ్వాసం కలిగింది. సినిమా వ్యాపారం ఎలా చేస్తే రీజనబుల్ అనేది నాకు తెలుసు. అందుకే ఇన్నేళ్లు పరిశ్రమలో కొనసాగుతున్నాను. ప్రతి ఫ్రైడే ఇక్కడ తలరాతలు మారిపోతుంటాయి. డబ్బుతో పాటు పేరు కూడా పోతుంది. ఎందుకంటే సినిమా అనేది పబ్లిక్ ప్లాట్ ఫామ్. సినిమా బాగుంటే ప్రశంసించే వాళ్లే. బాగా లేకుంటే విమర్శిస్తారు. దర్శకుడు స్క్రీన్ నుంచి ఆడియెన్స్ కు సినిమాను ఊహిస్తాడు. కానీ ప్రొడ్యూసర్ ఆడియెన్స్ నుంచి స్క్రీన్ కు సినిమాను ఊహించుకోవాలి. ప్రొడ్యూసర్ కావాలంటే ఈ క్వాలిటీ తప్పకుండా ఉండాలి. సినిమా క్రియేటివ్ గా ఉంటూనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండాలి. అప్పుడే ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. తెలుగు సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వెళ్లాలి. అదే ప్రొడ్యూసర్స్ గా మేము కోరుకునేది. అన్నారు.


