
కికు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కికు చిరంజీవి. రామకృష్ణ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేయగా దీప్తి నడిమింటి నిర్మించారు. తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, గిరీష్, ఈశ్వరి రావ్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
చిరంజీవి (కికు యనమల) అరుదైన గుండె సమస్యతో బాధపడే అనాథ ఫొటోగ్రాఫర్. మను (కశిష్ ఖాన్) కూడా అనాథే. ఆమెను శ్రీకాంత్ అయ్యంగార్ దత్తత తీసుకుని పెంచుతాడు. ఓ వ్యక్తి ఆమె పెట్టిన షరతుకు అంగీకరించడంతో అతడిని కలిసేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌కు బయలుదేరుతుంది. ఆ టూర్‌ను కవర్ చేయడానికి చిరంజీవి కూడా వస్తాడు. అయితే ఆమె చేసుకోబోయే వ్యక్తి బస్సు ప్రమాదంలో చనిపోవడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత అడవిలోకి వెళ్లిన వీరిని కొందరు వెంటాడుతారు. ఈ క్రమంలో చిరంజీవికి ఆక్సిజన్ అందక శరీరం నీలంగా మారడంతో ఆసుపత్రికి తీసుకెళ్తారు. అప్పుడే తన గుండె కుడివైపున ఉందని తెలుస్తుంది. బీచ్‌లో చిరుపై దుండగులు దాడి చేయడంతో అతడి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఆ సమయంలో ఈశ్వరీరావు తన కారులో చిరుకు లిఫ్ట్ ఇచ్చి కాపాడుతుంది. ఆ తర్వాత చిరు, మను పెళ్లి చేసుకుంటారు. ఫస్ట్ నైట్ తర్వాత ఉదయం మను చూసేసరికి కుడివైపు ఉండాల్సిన చిరు గుండె ఎడమవైపు కొట్టుకుంటూ ఉంటుంది. ఒక్క రాత్రిలోనే గుండె స్థానం ఎలా మారింది? అసలు చిరంజీవికి ఏమైంది? ఈశ్వరీరావు గతం ఏమిటి? బస్సును నడిపిన ‘స్పైడర్ మ్యాన్’ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానంగా తెలియాలంటే వెండి తెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
చిరంజీవి పాత్రలో హీరో కికు యనమల ఆకట్టుకున్నారు. ఫన్నీ, సీరియస్ షేడ్స్‌ను చక్కగా చూపిస్తూ మెప్పించాడు. ముఖ్యంగా అతడి పాత్రలో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఇది తొలి సినిమా అయినప్పటికీ కికు మంచి ఎనర్జీతో నటించాడు. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. మనుగా కశిష్ ఖాన్ తన పరిధి మేరకు బాగానే చేసింది. అయితే కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ కాస్త ఓవర్‌గా అనిపిస్తాయి. ఈశ్వరీరావు తన పాత్రలో ఆకట్టుకున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, వైవా రాఘవ, తనికెళ్ల భరణి బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో నటించారు.
సాంకేతిక విశ్లేషణ :
దర్శకుడు శుభ సాయి వెంకట్ ఎంచుకున్న కథ, కథనం ఆసక్తికరంగా ఉన్నాయి. కాస్త తడబడినప్పటికీ బాగానే అనిపించింది. సెకండాఫ్‌లో ట్విస్టులు, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను బాగా డీల్ చేశాడు. ఫన్, రొమాన్స్ కూడా ఆకట్టుకుంటాయి. రామకృష్ణ కెమెరా పనితనం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. శేఖర్ చంద్ర సంగీతం ఫర్వాలేదనిపించినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్ సన్నివేశాల్లో ఆర్ఆర్ బాగా వర్కౌట్ అయింది. ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. దీప్తి నడిమింటి నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, టెస్టులు, నటీనటుల నటన, పాటలు
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ కాస్త డైరెక్షన్ మిస్ అవ్వడం
సారాంశం :
ట్విస్టులతో కూడి ప్రేక్షకులు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేసే చిత్రం కికు చిరంజీవి.


