
ప్రముఖ దర్శకురాలు గ్రెటా గెర్విగ్ తెరకెక్కిస్తున్న కొత్త ఫాంటసీ చిత్రం ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ ట్రైలర్ విడుదలైంది. సీ.ఎస్. లూయిస్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మాయాజాలం, ఉత్కంఠ, అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ సినిమా 2027 ఫిబ్రవరి 12న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్ర ట్రైలర్లో నార్నియా అనే అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేశారు. డేవిడ్ మెక్కెన్నా డిగరీ కిర్క్ పాత్రలో, బీట్రైస్ క్యాంప్‌బెల్ పాలీ ప్లమ్మర్ పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి ప్రయాణం నార్నియా అనే మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఎమ్మా మాకీ యువ జాడిస్ పాత్రలో, డేనియల్ క్రెయిగ్ అంకుల్ ఆండ్రూ పాత్రలో నటిస్తున్నారు. కేరీ ముల్లిగన్, కోబ్నా హోల్డ్‌బ్రూక్-స్మిత్, మెరిల్ స్ట్రీప్ తదితరులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘బార్బీ’ వంటి ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన చిత్రాన్ని తెరకెక్కించిన గ్రెటా గెర్విగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విడుదలైన ఫస్ట్‌లుక్‌లో జాడిస్తో పాటు డిగరీ, పాలీ పాత్రలను పరిచయం చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాలోని పాత్రలు, కథా ప్రపంచంపై ప్రేక్షకులకు మరింత స్పష్టత వచ్చింది.
సీ.ఎస్. లూయిస్ రాసిన ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’ పుస్తకాల ప్రచురణ క్రమంలో ‘ది మెజీషియన్స్ నెఫ్యూ’ ఆరో పుస్తకం. అయితే కథాక్రమం ప్రకారం ఇది ‘ది లయన్, ది విచ్ అండ్ ది వార్డ్రోబ్’కు ముందు జరిగే సంఘటనలను వివరిస్తుంది. నార్నియా ప్రపంచం ఎలా ఆవిర్భవించిందనే విషయాన్ని ఈ కథ ప్రధానంగా చూపిస్తుంది.
నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ రీలీజింగ్ ఇంటర్నేషనల్ పంపిణీ చేస్తోంది. ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ 2027 ఫిబ్రవరి 12న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది.


