
శ్రీ ఆంజనేయ క్రియేషన్స్ బ్యానర్‌పై బిందు సారది పొలూరి నిర్మించిన చిత్రం ‘ఒక్క చూపుతో.. మొదలైన’. శివచౌదరి మద్దినేని హీరోగా, బి. జస్విక హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి చెంచయ్య నూతలపాటి దర్శకత్వం వహించారు. డి.ఎస్. రావు, రామ్ పటాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18, 2026న విడుదలైంది.
పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ సినిమా హైస్కూల్, కాలేజీ రోజులలో మొదలైన స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రేమకథను చూపిస్తుంది.
కృష్ణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. కాలేజీలో ఒక గ్రూప్‌కు లీడర్‌గా ఉంటూ సురేష్, శ్రీనివాస్, సుబ్బారావు, రవి అనే స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. కృష్ణకు ఆవేశం ఎక్కువ. చిన్న చిన్న గొడవల్లో కూడా ముందుండే స్వభావం అతనిది.
మరోవైపు నీహారిక 16 ఏళ్ల యువతి. విశ్వనాథ్ పెద్ద కుమార్తె. ఆమె సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఒక రోజు నాటకం ప్రాక్టీస్ చేస్తున్న కృష్ణను చూసిన నీహారిక అతనిపై మనసు పారేసుకుంటుంది. ఆ తర్వాత అట్లతద్ది పండుగ రోజున కృష్ణ కూడా నీహారికను చూసి ప్రేమలో పడతాడు.
ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం క్రమంగా అందరికీ తెలుస్తుంది. కృష్ణ స్నేహితుడు సురేష్ వారి ప్రేమకు అండగా నిలుస్తాడు.
అయితే ఒక రోజు రాత్రి నీహారికను కలవడానికి కృష్ణ, విశ్వనాథ్ బంగ్లా ఎక్కుతాడు. ఈ విషయాన్ని పక్కింటి రాజు గమనించి విశ్వనాథ్‌కు చెబుతాడు. దీంతో ఆగ్రహించిన విశ్వనాథ్ నీహారికను మందలిస్తాడు. ఈ విషయం ఇంట్లో చదువుకుంటున్న సుబ్బారావుకు కూడా తెలుస్తుంది. ఆవేశంతో సుబ్బారావు తన స్నేహితులకు దూరమవుతాడు.
నీహారిక ప్రేమలో పడిన తర్వాత కృష్ణలో కూడా మార్పు వస్తుంది. కాలేజీకి సరిగా వెళ్లకుండా గొడవలకు దిగే కృష్ణ.. ప్రేమలో పడిన తర్వాత గొడవలకు దూరమై మంచి వ్యక్తిగా మారుతాడు.
కూతురి ప్రేమను ఆపేందుకు విశ్వనాథ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. నీహారికను తన దగ్గర ఉంచకుండా పార్వతి దగ్గర రెండు సంవత్సరాలు ఉంచుతాడు. అయినా కృష్ణ, నీహారికల ప్రేమ మాత్రం ఆగదు.
తర్వాత బొడ్డురాయి ప్రతిష్ఠ కార్యక్రమం కోసం విశ్వనాథ్ నీహారికను ఊరికి తీసుకొస్తాడు. ఈ సమయంలో కృష్ణ నీహారికను తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో ఆగ్రహించిన విశ్వనాథ్ కృష్ణపై కాల్పులు జరిపి, తన తమ్ముడు ఎస్ఐ వరుణ్‌కు విషయం చెబుతాడు.
చివరి నిమిషంలో రామశర్మ ద్వారా కృష్ణది స్వచ్ఛమైన ప్రేమ అని విశ్వనాథ్ తెలుసుకుంటాడు. అదే సమయంలో ఎస్ఐ వరుణ్ వదిలిన బుల్లెట్‌కు అడ్డుగా నిలబడి కృష్ణ, నీహారికల ప్రేమను విశ్వనాథ్ కాపాడుతాడు.
తన కూతురిపై కృష్ణకు ఉన్న ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకున్న విశ్వనాథ్ చివరకు వారి ప్రేమను అంగీకరిస్తాడు.
‘ప్రేమకు సమయం కావాలి’ అనే సందేశంతో స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కింది.


