‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే: బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాన తారాగణం అద్భుతమైన నటన, వెంకీ అట్లూరి రచనలోని బలం, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరి ‘విశ్వనాథ్ & సన్స్’ను గొప్ప చిత్రంగా మలిచాయి. అందుకే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తూ, వసూళ్ళ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం, హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం.

ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ కథ విన్నప్పటి నుంచే, ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను(నవ్వుతూ). త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా సతీమణి సూర్య గారికి పెద్ద ఫ్యాన్. సూర్య గారితో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య గారి మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, సూర్య గారితో ఫోటో దిగారు. ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య గారు ఒకరు. ఇండియాలో ఇద్దరే హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు. గజినీలో సూర్య గారు పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైన పాత్ర. కొన్ని పాత్రలు మనతో పాటు దశాబ్దాల పాటు ప్రయాణిస్తాయి. అలాంటి పాత్ర అది. హిందీ గజినీ చేసిన సమయంలో ‘నేను సూర్యను మ్యాచ్ చేయలేకపోయాను’ అని స్వయంగా అమీర్ ఖాన్ గారు ఒప్పుకున్నారు. జల్సా సినిమా చేసేటప్పుడు ఈ విషయం నాకు అల్లు అరవింద్ గారు చెప్పారు. ఆ లుక్ ని మళ్ళీ తీసుకురావడం కోసం వెంకీ పడిన కష్టానికి, అది రాయడంలో గానీ, తీయడంలో గానీ హ్యాట్సాఫ్. వెంకీ చాలా బాగా రాశారు. ఎడిట్ లో చూసిన సమయంలోనే నాకు అనిపించింది.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు భవిష్యత్తులో ఐకానిక్ సీన్స్ గా మిగిలిపోతాయి. ఈ సినిమాలో నాలుగు పిల్లర్స్ ఉన్నాయి. ఒక పిల్లర్ సూర్య గారైతే, ఇంకో పిల్లర్ రాధిక గారు, మూడో పిల్లర్ రవీనా టాండన్ గారు, ఇంకో పిల్లర్ మమితా బైజు గారు. నేను కేజీఎఫ్ చూశాను, అలాగే బయట కూడా నాకు రవీనా గారు తెలుసు. బయట స్ట్రాంగ్ గా, డైనమిక్ లేడీలా కనిపిస్తారు. కానీ, ఇందులో ఆశ్చర్యకర పాత్ర పోషించారు. చాలా సహజంగా నటించారు. చూసే వారికి అది తేలికగా అనిపించవచ్చు కానీ, ఆ పాత్ర పోషించడం ఎంత కష్టమో నాకు తెలుసు. మమితా పాత్రకు తగ్గట్టుగా ఎంతో ఎనర్జిటిక్ గా చేశారు. ఇక సూర్య గారిది చాలా డిఫికల్ట్ క్యారెక్టర్. కొంచెం కూడా ఎక్కువ చేయకూడదు. అలా అండర్ పెర్ఫార్మ్ చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలో సూర్య గారు అద్భుతంగా నటించారు. సూర్య గారి సినిమా నిర్మాణంలో మా ప్రొడక్షన్ పేరు కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ, సూర్య గారి సినిమాకి దర్శకుడిగా నా పేరు పడినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషిస్తాను. ఒక్క ఏడాది వ్యవధిలో కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి రెండు పూర్తి విభిన్న సినిమాలు చేశారు. సూర్య గారు ప్రయాణం మళ్ళీ కొత్తగా మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది. మనతో ప్రయాణిస్తున్నారు, మనకు ఎన్నో ఙ్ఞాపకాలు ఇస్తున్నారు. సూర్య గారి నుంచి నేర్చుకోవాల్సింది వినయం. సూర్య తండ్రి గారు (శివకుమార్) అంటే నాకెంతో గౌరవం. సూర్య గారు, కార్తీ గారిని తెలుగు హీరోలుగా భావిస్తాం. ఇప్పుడు తమిళ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా అనే హద్దులు లేవు. ఇప్పుడు అన్ని భాషలు కలిపి ఇండియన్ సినిమా అయింది. ప్రపంచ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటాల్సిన సమయం ఇది. ఆ దిశగానే మేమందరం పని చేస్తున్నాం. వెంకీ, వంశీ సహా టీమ్ అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా అందరి తరపున కృతజ్ఞతలు.” అన్నారు.

కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. “మీరు చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. త్రివిక్రమ్ గారు ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాకతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది. త్రివిక్రమ్ గారి ఆశీస్సులు, ప్రేమ, మద్దతు వల్లే ఈ సినిమా సాధ్యమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో నా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాగవంశీ గారితో మరిన్ని సినిమాలు చేయాలని, మరిన్ని ఙ్ఞాపకాలు మూట కట్టుకోవాలని కోరుకుంటున్నాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. నేను తమిళనాడు, మమితా కేరళ, రవీనా గారు మహారాష్ట్ర. మేమందరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చాము, విభిన్న భాషలు మాట్లాడతాం. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాము. దానిని మీరు ఆదరిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేమను కురిపిస్తూ.. ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకులు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ప్రేమను, గౌరవాన్ని చూపిస్తున్నారు. మా అందరికీ ఫ్యామిలీ జానర్ ఎంత ముఖ్యమో మళ్ళీ తెలియజేసింది ఈ సినిమా. ఫ్యామిలీ సినిమాల విషయంలో త్రివిక్రమ్ గారి స్పూర్తి ఎంతో ఉంటుంది. ఇలాంటి గొప్ప సినిమాను అందించిన వెంకీ అట్లూరికి కృతజ్ఞతలు. కొన్ని సినిమాలను వసూళ్లతో కొలవలేము. ప్రేక్షకులు పొందిన అనుభూతిలోనే ఈ సినిమా అసలు విజయం దాగుంది. వెంకీ రచనకు హ్యాట్సాఫ్. అలాగే తెలుగు ప్రేక్షకులకు నా ప్రత్యేక కృతఙ్ఞతలు.” అన్నారు.

నటి రవీనా టాండన్ మాట్లాడుతూ.. “విశ్వనాథ్ & సన్స్ సక్సెస్ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాపై ప్రేమను కురిపిస్తూ, ఇంతటి విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. వెంకీ అట్లూరి గొప్ప దర్శకుడు. వినయంగా, ప్రేమగా ఉంటూ అందరి నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటూ ఉంటారు. భావోద్వేగాలతో నిండిన అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి గొప్ప సినిమాను అందించిన దర్శకుడు వెంకీకి అభినందనలు. ఈ షూటింగ్ ఒక పిక్నిక్ లాగా, ఎంతో సరదాగా జరిగింది. సూర్య గారికి ఎంతో క్రేజ్ ఉంది. కేవలం ఆయనను కలవడం కోసమే నా ఫ్రెండ్స్ మూవీ సెట్స్ కి వచ్చేవారు. రాధిక గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ వెన్నుముకలా నిలిచి, ఇంత మంచి సినిమాని అందించిన నాగవంశీ గారికి అభినందనలు.” అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “ముందుగా ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ కథ రాసినప్పుడు ట్రెండ్ ఇది కాదు. యాక్షన్, డార్క్ హ్యూమర్, హారర్, డివోషనల్ లాంటి సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో ఫ్యామిలీ సినిమా చేస్తానంటే, ఎవరైనా నిరుత్సాహ పరుస్తారు. కానీ, వంశీ గారు అలా చేయలేదు. త్రివిక్రమ్ గారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. త్రివిక్రమ్ గారు ఎప్పుడైతే ఈ సినిమాను తనది అనుకున్నారో, ఆ తర్వాత అన్నీ వాటంతట అవే కుదిరాయి. మొదటి రోజుతో పోలిస్తే, రెండో రోజు రెట్టింపు వసూళ్ళు వస్తున్నాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. 30 శాతం, 40 శాతం వసూళ్లు పెరగడం నేను విన్నాను. కానీ, వసూళ్ళు రెట్టింపు అవ్వడం నా కెరీర్ లో మొదటిసారి చూస్తున్నాను. అందరూ నేను బాగా రాశానని అంటున్నారు. కానీ, సూర్య గారు ఈ సినిమాని భుజాల మీద మోశారు. ఈ వసూళ్ళ ఘనత అంతా ఆయనకే దక్కుతుంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.” అన్నారు.

ఈ కార్యక్రమానికి చిత్ర పంపిణీదారులు హాజరై, సినిమా సాధిస్తున్న భారీ వసూళ్లపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే నటులు సునీల్ రెడ్డి, వైవా హర్ష, ఫైట్ మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొని చిత్ర విజయం పట్ల తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Related Articles

Latest Articles