
స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటుతూ ‘హర్ ఘర్ తిరంగ’ సందేశాన్ని బలోపేతం చేస్తూ, మోహన్ బాబు విశ్వవిద్యాలయం, శ్రీ విద్యానికేతన్ అంతర్జాతీయ పాఠశాలకు చెందిన 20,000 మందికి పైగా విద్యార్థులు తిరుపతిలో ఘనమైన త్రివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. వీరంతా కలిసికట్టుగా అద్భుతమైన 100 అడుగుల పొడవైన భారత త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని నడిచారు. వేలాది మంది విద్యార్థులు జాతీయ పతాకంతో కలిసి నడుస్తున్న దృశ్యం దేశభక్తి, ఐక్యత, జాతీయ గర్వానికి శక్తివంతమైన ప్రదర్శనగా నిలిచింది.
మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ విష్ణు మంచు, వైస్-ఛాన్సలర్, అధ్యాపక సిబ్బంది సభ్యులతో కలిసి ఈ ర్యాలీలో విద్యార్థులతో పాల్గొన్నారు. ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచార స్ఫూర్తితో, యువతరాన్ని స్వాతంత్ర్య దినోత్సవాన్ని గర్వంగా జరుపుకోవడానికి, దేశంతో వారి బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రోత్సహించేందుకు ఈ ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘త్రివర్ణ పతాకం మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, ప్రతి భారతీయుడి ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక. మోహన్ బాబు విశ్వవిద్యాలయం, శ్రీ విద్యానికేతన్ అంతర్జాతీయ పాఠశాల నుండి వేలాది మంది విద్యార్థులు ఇంతటి ఉత్సాహంతో కలిసి రావడం ఎంతో స్ఫూర్తిదాయకం. విద్యాసంస్థలుగా, కేవలం విద్యాపరంగానే కాకుండా, దేశం పట్ల తమ బాధ్యత గురించి కూడా స్పృహ కలిగిన యువతరాన్ని తీర్చిదిద్దడం మన బాధ్యత’ అని అన్నారు.
మోహన్ బాబు విశ్వవిద్యాలయం, శ్రీ విద్యానికేతన్ అంతర్జాతీయ పాఠశాల విద్యార్థుల భాగస్వామ్యం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల హృదయభాగంలో ఉండే ఐక్యతా స్ఫూర్తిని, సామూహిక గర్వాన్ని ప్రతిబింబించింది. ఈ త్రివర్ణ ర్యాలీ.. విశ్వవిద్యాలయ, పాఠశాల విద్యార్థుల్ని ఒకచోట చేర్చి, దేశభక్తిని, జాతీయ పతాకం పట్ల గౌరవాన్ని పంచుతూ ఒక చిరస్మరణీయ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకగా నిలిచింది.


