
“స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే” విడుదలకు ముందు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతూ జాతీయ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ప్రత్యేకంగా ఓ స్పైడర్‌మ్యాన్ ఆంథమ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ సాండీ మాస్టర్ కొరియోగ్రఫీ వహించగా, వెంగాయో ఫాలో అయ్యారు. ఈ మ్యూజిక్ వీడియోలో స్పైడర్‌మ్యాన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. సాండీ మాస్టర్ రూపొందించిన స్టెప్పులు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి డ్యాన్స్ చేసేలా ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ సందర్భంగా జీవీ ప్రకాష్ మాట్లాడుతూ.. “సంగీతం, స్పైడర్‌మ్యాన్ రెండింటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలిపే శక్తి ఉంది. చిన్నప్పటి నుంచే నేను స్పైడర్‌మ్యాన్ అభిమానిని. అలాంటి అభిమాన హీరో కోసం పాట కంపోజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాట కూడా అభిమానులు గుర్తుంచుకునే మరో స్పైడర్‌మ్యాన్ జ్ఞాపకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.
సాండీ మాస్టర్ మాట్లాడుతూ.. “స్పైడర్‌మ్యాన్ అంటే ప్రతి ఒక్కరిలోని చిన్నపిల్లాడిని బయటకు తీసుకొచ్చే సూపర్ హీరో. అందుకే ఈ పాటలో సరదా, ఉత్సాహం కనిపించేలా స్టెప్పులు రూపొందించాం. అభిమానులందరూ ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
టామ్ హాలండ్ హీరోగా నటించిన ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా జూలై 30న భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


