
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు ఉత్తమ మేకప్ విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల నిర్మాత ఫణి అడపాక హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాతగా తన ప్రయాణం ‘సిద్ధార్థ్ రాయ్’ చిత్రంతో ప్రారంభమై, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌తో కలిసి ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి మంచి కథతో కూడిన చిత్రాన్ని నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం తమ మొత్తం టీమ్ కృషికి దక్కిన గొప్ప గుర్తింపని పేర్కొన్నారు.
ఈ విజయానికి దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, యూనిట్ సభ్యులు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థతో పాటు చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ETV Winతో కలిసి కొత్త ప్రాజెక్టులు రూపొందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా నాణ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినిమా స్థాయిని మరింత ఉన్నతంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని ఫణి అడపాక వెల్లడించారు.


