
టాలీవుడ్ కింగ్‌గా అభిమానుల మనసుల్లో నిలిచిన అక్కినేని నాగార్జున, తన వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వీడియోలను వాడుకుని వ్యాపారాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఇలాంటి కేసుల్లో కోర్టును సంప్రదించిన సంగతి తెలిసిందే.
జస్టిస్ తేజస్ కారియా ఈ పిటిషన్‌ను విచారించి, నాగార్జున పర్సనాలిటీ రైట్స్‌ను రక్షిస్తామని తీర్పు వెలువరించారు. నాగార్జున తరపు న్యాయవాది కోర్టులో వాదిస్తూ, AI ద్వారా తయారు చేసిన వీడియోలు, పెయిడ్ ప్రమోషన్లు, హ్యాష్‌ట్యాగ్‌లు, టీ-షర్టులపై పేరు-ఫోటోల ముద్రణ, పోర్నోగ్రఫీ సైట్లలో దుర్వినియోగం వంటివి ఆపాలని కోరారు. ఐశ్వర్య రాయ్ కేసును ఉదాహరణగా చూపి, 14 వెబ్‌సైట్లలోని అనుచిత కంటెంట్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ తీర్పు సినీ నటులకు తమ ఇమేజ్‌ను రక్షించుకోవడంలో మరిన్ని బలమైన ఆధారాలను అందిస్తుంది, అనధికారిక వినియోగాన్ని కట్టడి చేస్తుంది.


