
సుప్రసిద్ధ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్పి ఇద్దరు పిల్లలు రూ.30 వేల కోట్ల విలువైన సంపద కలిగిన తమ తండ్రి సంజయ్ కపూర్ నుంచి ఆస్తిలో వాటా కోరుతూ మంగళవారం కోర్టుకెక్కారు. వారి దరఖాస్తు బుధవారం విచారణ రానుంది. కరిష్మా, సంజయ్ కపూర్లు 2003లో వివాహం చేసుకొని 2016లో విడాకులు పొందారు. వారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. తమ సవతి తల్లి ప్రియా కపూర్కు ఆస్తి మొత్తం చెందేలా తండ్రి రాసినట్టుగా చెబుతున్న వీలునా మాను పిల్లలిద్దరూ కోర్టులో సవాలు చేశారు. సంజయ్ కపూర్ కానీ, ప్రియా కపూర్ గానీ వీలు నామా విషయం ఏనాడూ ప్రస్తావించలేదని ఆరో పించారు. తమ సవతి తల్లి ప్రియ ఫోర్జరీ చేసి నకిలీ వీలునామాను సృష్టించారని పిల్లలు తమ అభ్యర్థనలో పేర్కొన్నారు. వీలునామా సిసలైనదికానందునే దాని ప్రతిని తమకు అందించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. తమ తండ్రి మరణించే నాటికి ఆయన వ్యక్తిగత ఆస్తుల్ని గురించిన వివ రాలు తమకు తెలియవని వారు కోర్టుకు సమర్పించిన అభ్యర్థనలో పేర్కొన్నారు. తమ తండ్రి మరణించేనాటికి ఆయనకున్న ఆస్తి మొత్తం వివరా లను తెలియజేయాలని వారు సవతి తల్లి ప్రియా కపూర్ను కోరారు. సంజయ్ కపూర్ ఈ సంవత్సరం జూన్లో లండన్లో పోలో ఆడుతూ గుండె పోటుతో మరణించారు. సంజయ్ సహజంగా మరణించలేదని, హత్యకు గురయ్యాడని పేర్కొంటూ ఇటీవల ఆయన తల్లి రాణీ కపూర్ బ్రిటన్ అధికారులకు లేఖ రాశారు. తన కుమారుడి హత్య వెనక దాగిన కుట్రను, ఆర్థిక మోసాన్ని బహిర్గత పరిచేందుకు విచారణ జరపాల్సిందిగా ఆమె బ్రిటన్ అధికారుల్ని కోరారు.


