
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ క్యాంప్ ఆఫీస్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించేందుకు యత్నించడంతో నగరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆగ్రహించిన అభిమానులు, శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, కార్యాలయం ఎదుట బైఠాయించి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, అభిమానులతో వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి మాత్రం ఆ ఆడియో క్లిప్ నకిలీదని, తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేస్తూ, అభిమానుల బాధకు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ, బహిరంగ క్షమాపణ కోరుతూ అభిమానుల నిరసన కొనసాగుతోంది.


