“పాపా” చిత్ర రివ్యూ

తమిళంలో “దాదా” పేరుతో విడుదలై, అక్కడ దాదాపు 40 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులో “పాపా”గా అనువదించబడి థియేటర్లలో విడుదలైంది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. తమిళంలో సృష్టించిన మాయాజాలాన్ని తెలుగులో కూడా పునర్సృష్టించగలిగిందా లేదా అన్నది విశ్లేషిద్దాం.

కథ:
కాలేజీ విద్యార్థులైన ఒక జంట, పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్ళికి ముందే హద్దులు దాటడం ద్వారా వారి జీవితంలో సంభవించే అనూహ్య మలుపుల సమాహారమే “పాపా”. యవ్వనంలోని ఆకర్షణలు, ఆవేశాలు, అపార్థాలు, తరాల మధ్య అంతరాలు, వ్యక్తుల మధ్య ఇగోలు, స్నేహం, సహాయస్వభావం, మరీ ముఖ్యంగా బంధాలు, భావోద్వేగాల కలయికగా ఈ చిత్రాన్ని దర్శకుడు గణేష్ బాబు హృదయస్పర్శిగా తెరకెక్కించారు. దర్శకుడిగా ఈయన పేరు భవిష్యత్తులో మరింత వినిపిస్తుందనడంలో సందేహం లేదు. కథ సరళంగా అనిపించినా, కథనం ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది, ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.

విశ్లేషణ:
భాగ్యరాజా, విటివి గణేష్ తప్ప, మిగిలిన పాత్రలు పోషించిన నటులు కొత్తవారైనప్పటికీ, ప్రేక్షకులు వారి పాత్రలతో భావోద్వేగంగా కనెక్ట్ అవుతారు. హీరోగా కవిన్, హీరోయిన్‌గా అపర్ణాదాస్ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. వీరి కుమారుడిగా నటించిన మాస్టర్ ఇయాన్ పాత్ర కూడా మనసు దోచుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల కంటిలో నీరు తెప్పిస్తాయి. హృదయాన్ని కదిలించే ఈ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. భారమైన హృదయంతో థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు, చాలా రోజుల తర్వాత ఒక ఫీల్-గుడ్ సినిమా చూసిన సంతృప్తిని పొందుతారు. హీరోయిన్ అపర్ణాదాస్, నయనతార కెరీర్ ప్రారంభంలోని తారను పోలి ఉండటం వల్ల, ఆర్య-నయనతార నటించిన “రాజా-రాణి” చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే, ఈ పోలిక కేవలం జోనర్‌కు మాత్రమే పరిమితం.

ప్లస్ పాయింట్స్:
దర్శకత్వం, నటీనటుల అద్భుత నటన తర్వాత, ఛాయాగ్రహణం మరియు సంగీతం చిత్రానికి మరింత బలం చేకూరుస్తాయి. అనువాదంలో తీసుకున్న జాగ్రత్తలు “పాపా” చిత్రానికి మరో ఆకర్షణ. డబ్బింగ్ చిత్రమనే భావన కలగకుండా, స్ట్రెయిట్ సినిమా చూస్తున్న అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు. సంభాషణలు కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి, మరికొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి.

మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్‌లో మరింత స్ఫుర్తిదాయకంగా ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో హీరో-హీరోయిన్ల మధ్య సంఘర్షణను మరింత ఎఫెక్టివ్‌గా చూపించేందుకు రెండు మూడు సన్నివేశాలను జోడించి ఉంటే భావోద్వేగం మరింత గాఢంగా ఉండేది. సింగిల్ పేరెంటింగ్‌లోని బాధ, తండ్రి-కొడుకుల మధ్య బంధానికి మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అయినప్పటికీ, హృదయాన్ని ఆకట్టుకునే క్లైమాక్స్ ఈ చిన్న చిన్న లోపాలను మరిపిస్తుంది, దర్శకుడి పట్ల గౌరవాన్ని పెంచుతుంది.

సారాంశం:
ఫీల్-గుడ్ సినిమాలను ఇష్టపడే వారంతా తప్పక చూడాల్సిన అద్భుత చిత్రం “పాపా”. ఎన్నారై ప్రొడ్యూసర్ శ్రీమతి నీరజ కోట ఉన్నత రుచిని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. టాలీవుడ్‌కు ఒక రుచిగల నిర్మాతను పరిచయం చేసిన చిత్రంగా “పాపా” చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Related Articles

Latest Articles