ప్రతిఒక్కరు చూడాల్సిన సినిమా పలాస 1978 – ఎమ్మార్సీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

రక్షిత్, నక్షత్ర జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా కరుణకుమార్‌ దర్శకత్వంలో
తెరకెక్కిన సినిమా ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌
అట్లూరి నిర్మించిన ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న
విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాని ఎమ్మార్పీఎస్
అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మందకృష్ణ
మాదిగ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బాబాసాహేబ్ అంబేడ్కర్ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది
అన్నారు మందకృష్ణ మాదిగ. బడుగు బలహీన వర్గాల గురించి వచ్చే సినిమాలు చాలా
తక్కువ అని, కచ్చితంగా ఊరికి దూరంగా వెలివేయబడ్డ మా జీవితాలు గురించి
చాలా గొప్పగా సినిమా తీశారని అన్నారు మందకృష్ణ మాదిగ. దళితులు
అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించే ఏ అంశాన్ని అయిన
ప్రోత్సహించాలని, అందుకే ఈ సినిమా కచ్చితంగా చూడాలని అన్నారు మందకృష్ణ
మాదిగ.

ఈ సినిమా ఒక్కసారి చూస్తే సరిపోతు అని, పది సార్లు చూసినా తక్కువ కాదని
అన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు జీవం పోసిన ప్రతి ఒక్కరిని
అభినందిస్తున్నట్లు చెప్పారు ఆయన. ఎవరెవరి దృక్కోనాల్లో తీసే సినిమాలు
ఆదరించారని, మన కోణంలో చూసే సినిమాని అందరూ చూడాలని అన్నారు. సోదరులు
చిరంజీవి నటించిన స్వయంకృషి, దాసరి నారాయణ రావు తీసిన సినిమాలు చాలావరకు
సామాజిక కోణాల్లో ఉంటాయని,  అటువంటి గొప్ప చిత్రాలు మళ్లీ రావు
అనుకున్నామని.. మా జీవితాలు వాస్తవంగ చూపెట్టిన సినిమా పలాస 1978 అని
అన్నారు.

సినిమాలో ప్రతీ పాత్ర మాట్లాడిన మాటలు కళ్లు చెమర్చేలా చేస్తాయని
అన్నారు. కచ్చితంగా ఇటువంటి సినిమాని ప్రోత్సహించి అండగా నిలబడాల్సిన
అవసరం ఉందని అన్నారు. చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరిని
అభినందిస్తున్నట్లు చెప్పారు. మా వంతు పాత్రగా జిల్లాల్లో ఈ సినిమాని
ప్రచారం చేస్తాం అని అన్నారు.  సినిమా ప్రదర్శించే చోటకు ఎమ్ఆర్‌పీఎస్‌తో
పాటు అనుబంధ సంఘాలను ర్యాలీగా కూడా వెళ్తామని అన్నారు.

పలాస లాంటి ఏరియాలో జరిగిన ఘటనలు గురించి చాలా చక్కగా చూపించారని అన్నారు
ఆయన.  తెలుగు భాష మాట్లాడే ప్రతి చోట ఈ సినిమాను చూసేలా ప్రచారం
చెయ్యాలని కోరారు. అన్యాయం జరిగితే పోరాడే గొంతులా తయారవ్వాలని కోరారు.
అంబేడ్కర్ మీద గౌరవంతో ప్రతి ఒక్కరు సినిమాని చూడాలని కోరారు. సినిమా
ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు మాత్రమే తెలుసునని, ఆయన సామాజిక స్పృహతో
తీసిన సినిమాలు ఎంతో గొప్పవి అని, ఆయన తర్వాత గౌరవించే వ్యక్తి
తమ్మారెడ్డి భరద్వాజ గారు అని అన్నారు.

పలాస సినిమాని ప్రోత్సహించడం దళితుల బాధ్యత అని భరద్వాజ గారు అన్నారని, ఆ
మాట అన్నప్పుడు మనసుకు ఆవేదన వ్యక్తం అయ్యింది అని,  దళితుల కోణం నుంచి
తీసిన సినిమాని టైమ్ తీసుకుని చూడాలని నిర్ణయించుకుని దళితుల
ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని చాటే, చైతన్యపరిచేలా ఉన్న సినిమాని
ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఈ
సినిమా చూడాలని అన్నారు. సినిమా ముగిసే సమయంలో వచ్చే డైలాగులు సామాన్యుల
జీవితాలను ప్రభావితం చేస్తాయని అన్నారు.