గోవుల కొమ్ముల్లోంచి, గొర్రెల తోకల్లోంచి సభ్యసమాజపు విచ్ఛిన్నకర శక్తులు పుట్టుకొస్తాయి, జాగ్రత్త! ఖబడ్దార్‌!!

ఒకప్పుడు రాజకీయం ప్రజాసేవ చేయాలనుకునే ప్రతి సామాన్యుడికీ అందుబాటులో లభ్యమయ్యే ఓ సాధనం, ఓ ఆయుధం. ఇప్పుడు అదే రాజకీయం కార్పోరేట్‌ స్థాయికి ఎగబాకి, ఓ వ్యాపారంలా మారి సామాన్యుడు ఎంత ఎగిరినా అందుకోలేని ఆకాశం, ఎంత దిగజారినా చేరుకోలేని పాతాళం అయిపోయింది. అందుకే పోటీ చేసి గెలిచిన రాజకీయ నాయకుల్లో అధికశాతం అధికారంలోకి రాగానే.. ‘గెలవటానికి ఎంతో ‘పెట్టుబడి’ పెట్టాం కాబట్టి.. ‘వడ్డీ’తో సహా ఎన్నికలకు అయిన ఖర్చులు, భవిష్యత్‌ ఎన్నికలకి అవ్వబోయే ఖర్చులు, తమ చుట్టూ తిరిగే క్యాడర్‌ని మెయిన్‌టైన్‌ చేయడానికి అయ్యే ఖర్చులు మరియూ తమ వారసుల కోసం అపరిమితమైన అక్రమ ఆస్తుల్ని ముందస్తుగానే సంపాదించేసుకోవాలి’ అన్న రీతిలో రాజకీయాన్ని మార్చేసి, నిఖార్సైన కార్పోరేట్‌ వ్యాపారస్థుల్లా తయారైపోయారు. ఇక ఇలాంటి వ్యాపారంలో రాణించడానికి ఎన్నికల ప్రచార సమయాల్లో ఓటమిపాలు అవ్వకూడదనే డెస్పరేషన్‌తో తమ స్థాయిని పక్కన పెట్టి మరీ.. చిత్రవిచిత్రమైన ఎత్తుకు పై ఎత్తులతో ‘తాగాడానికి ఒక్క బిందెడు మంచినీళ్ళు దొరక్కపోతే రేపే చనిపోతామేమో’ అన్న స్థాయిలో.. వీధికుళాయి దగ్గర బండ బూతులతో గయ్యాళీల చేసుకునే ముష్టి యుద్ధంలా.. ‘నాలుగు ఎంగిలి మెతుకుల మింగుడు పడకపోతే మరుక్షణమే మరణం తప్పదేమో’ అన్న స్థాయిలో.. కళ్యాణ మండపం వెనుక విసిరివేయబడ్డ విస్తరాకుల కోసం, కరుచుకునే కాట్లకుక్కల కొట్లాటలా.. విపరీతమైన నాటకీయ పరిణామాలతో రక్తి కట్టిస్తున్నారు. ఆ సమయాల్లో నీతి-నిజాయితీ, చీము-నెత్తురు, సిగ్గు-శరం, రోషం-పౌరుషం లాంటి లక్షణాలను పొరపాటున తమ దగ్గరకి చేరనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. అన్ని రకాలుగా ‘మేము అధములం’ అనిపించుకోవాలని.. ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు.

ఇక.. వారి రాజకీయ వ్యాపార లబ్దికోసం ఒకసారి ఒక రాజకీయ పక్షంతో కలుస్తున్నారు. మరొకసారి ఆ రాజకీయ పక్షంతోనే యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ.. లోపాయికారిగా వారితో కలిసే ఉంటున్నారు. వాళ్ళకి అవసరమైతే ‘మనమంతా భారతీయులం’-‘మనమంతా తెలుగువాళ్ళం’ అని కలిపేసుకుంటున్నారు. అవసరం లేకపోతే ‘ఉత్తరాది’వాళ్ళు-‘దక్షిణాది’వాళ్ళు, ‘తెలంగాణా’వాళ్ళు-‘ఆంధ్రా’వాళ్ళు అంటూ.. చివరకి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, యాసల పేరుతో వేరు చేసేస్తున్నారు. గత కొన్నేళ్ళ నుండీ వర్తమానం వరకూ జరుగుతున్న కొంత మంది రాజకీయ నాయకుల ఎన్నికల ప్రసంగాలైతే.. ప్రజల్లో చాలా ఉద్రేకపూరిత వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. ఒక నాయకుడు ‘మీవి కూల్చేస్తాం’ అంటే, ఇంకో నాయకుడు ‘మీరు కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా, ఆ వెంటనే మీవీ కూల్చేస్తాం’ అంటే, మరొక నాయకుడు ‘ఖండిస్తున్నాం’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ.. తమ తమ ఓట్ల బ్యాంక్‌లను పోలరైజ్‌ చేసుకోవడానికి.. మహనీయుల ‘సమాధులు’ మరియూ ‘పవిత్ర స్థలాల’పై యధేచ్ఛగా మాట్లాడేస్తూ.. ఓటర్లను తాత్కాలికంగా రెచ్చగొడుతూ, వారి మనోఫలకాలపై శాశ్వతంగా మాయని గాయాల్ని చేసేస్తున్నారు.

అసలు.. ఒక మనిషి ఏ ప్రాంతంలో పుట్టాడు, ఏ కులంలో పుట్టాడు, ఏ మతంలో పుట్టాడు అనే వాటి కంటే కూడా.. ఆ మనిషి తన జీవితకాలంలో తాను పుట్టిన సమాజం యొక్క శ్రేయస్సుకి ఎంతగా పాటుబడ్డాడు.. తన ఆశయాలతో, ఆచరణలతో ఎన్ని తరాల వరకూ ఆదర్శవంతమైన స్ఫూర్తిని నింపాడు అనేదే కీలకం-ముఖ్యం. అలా భావి తరాలకు స్ఫూర్తినిచ్చే జీవితాన్ని గడిపిన మహానుభావులు స్వర్గస్తులైన తరువాత, వారి యొక్క సమాధులను జ్ఞాపక మందిరాల్లా, తరతరాలకు స్ఫూర్తిని వెదజల్లే స్థూపాలుగా మలచుకుని సంస్మరించుకోవడం అనేది.. మన సంస్కృతిని మనం తిరిగి పునరుద్ధరించుకోవడం లాంటిది.

అటువంటి మహానీయుల్లో ఒకానొక అరుదైన ఆణిముత్యం లాంటి వారే.. ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’, ‘నటరత్న’, ‘కళాప్రపూర్ణ’, ‘తెలుగు జాతి ముద్దుబిడ్డ’, ప్రపంచవ్యాప్త తెలుగువారంతా ఆప్యాయంగా పిలుచుకునే ‘అన్న’ మరియు అభిమానుల పాలిట ‘దైవం’.. స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’గారు. ఆయన తన దివ్యమోహన రూపంతో సాంఘీక చలనచిత్రాల్లో తాను పోషించిన పాత్రల ద్వారా ఎందరికో స్పూర్తి నివ్వడమేగాక, హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళముందు కదలాడుతూ.. ‘తెలుగు భాష’ తియ్యదనాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే ‘తెలుగు పలుకు’లను తన వాక్పటిమతో కొత్తపుంతలు తొక్కించారు. ఇక వ్యక్తిగతంగా.. ఆయన మహానటులైనప్పటికీ ఏ ప్రభుత్వాన్ని గజం స్థలం కూడా యాచించకుండా, తన సొంత డబ్బుతో కొనుక్కున్న స్థలాల్లోనే సినిమా ధియేటర్స్‌ని, స్టూడియోలను నిర్మించుకుని హైద్రాబాద్‍లో సినీ పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి పాటుబడ్డారు. అంతేకాకుండా ‘ఆత్మగౌరవం’ నినాదంతో రాజకీయాల్లోకి ప్రవేశించి, అచంచలమైన ‘ఆత్మవిశ్వాసం’తో ఢిల్లీ గద్దెతో మడమ తిప్పని పోరాటం చేసి, ‘తెలుగు జాతి’లో ఒక మహత్తర రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ‘తెలుగు’వారి పౌరుషాన్ని దశదిశలా చాటి, అప్పటిదాకా ‘మదరాసీ’లుగా పిలవబడుతున్న ‘తెలుగు జాతి’కి ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు, ‘తెలుగు జాతి’ని సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఈనాడు వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్న ప్రముఖులెందరికో.. కుల మత, వర్గ, ప్రాంతాలకతీతంగా రాజకీయ భృతిని కూడా కల్పించారు.

ఆయన అధికారంలో ఉండగా ప్రవేశపెట్టిన సంచలన మరియూ సంక్షేమ పధకాలు.. జనాకర్షణలో మరెందరో రాజకీయ నాయకులకు మార్గదర్శకంగా నిలిచాయి, ఇప్పటికీ నిలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మత సామరస్యానికి చిహ్నాలుగా హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు మరియూ పాతబస్తీని విస్తరింపజేసి మతకలహాలను నిలువరింపజేశారు. మరీ ముఖ్యంగా, అప్పట్లో హైద్రాబాద్‍ ప్రతీ బస్తీలో దాదాగిరీ, గూండాగిరీ పేరుతో జులుం చెలాయించిన గ్యాంగ్‌లను కట్టడి చేశారు. ఎన్నో ఏళ్ళుగా వేళ్ళూనుకున్న పటేల్‌-పత్వారీ వ్యవస్థని రద్దుచేయడంతో, ‘తెలంగాణా’లోని గ్రామాలకే పరిమితమైన ప్రజలను.. పటేల్‌-పట్వారీల దాస్యశృంఖాలాల నుండీ విముక్తులను చేసి హైద్రాబాద్‍ వైపు నడిపించారు. భావితరాల్లో స్ఫూర్తి నింపడానికై ‘తెలుగుజాతి’కి సేవ చేసిన వివిధ రంగాల, ప్రాంతాల మహనీయుల విగ్రహాల్ని ట్యాంక్‌బండపై ఆవిష్కరింపజేశారు. ‘తెలుగువాడు’ ఏ ప్రాంతానికి చెందిన వాడైనా ఏ యాస, ఏ బాసల వాడైనా ప్రపంచంలో ఎక్కడకెళ్ళి స్థిరపడ్డా ‘తెలుగువాడే’ అంటూ ‘తెలుగుజాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది’ అన్న స్ఫూర్తిని నింపారు. హు.. ‘తెలుగుజాతి’కి ఇంత ఖ్యాతిని, ఇంత చైతన్యాన్ని, ఇంత స్ఫూర్తిని ఇచ్చిన మహానుభావుడినే టార్గెట్‌ చేస్తున్నారంటే.. ఇంక ఈ నాయకుల మానసిక దౌర్బల్యాన్ని మనం ఏమనుకోవాలి!!

‘తెలుగు జాతి’కి గర్వకారణం అయిన ఆ ‘మహాయోధుడు’, ‘కారణజన్ముడు’, ‘యుగపురుషుడు’కి.. ‘ఇండియా’లోని ‘రిక్షాపుల్లర్’ నుండి ‘అమెరికా’లోని ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల’ వరకూ కుల, మత, ప్రాంత, రాజకీయ పార్టీలకు అతీతంగా అసంఖ్యాక అభిమానులున్నారు. వారంతా ఆయన ఆశయాలు, ప్రసంగాల ద్వారా ఎంతో ఉత్తేజాన్ని, మరెంతో ఉద్వేగాన్ని పొందడమేగాకుండా.. ఆయన ‘జయంతి’ ఓ పండుగరోజులా, ‘వర్ధంతి’ ఓ స్మారకోత్సవంలా జరుపుకుంటూ.. తమ పూజ గదుల్లో ఆయన ప్రతిమని పెట్టుకుని, తమ స్థిరచరాస్తులపై ఆయన పేరుని రాసుకుని.. చివరకి తమ హృదయాల్లో ఆయన రూపాన్ని పచ్చబొట్టులా భద్రపరచుకుని తమ ఇష్ట‘దైవం’లా కొలుచుకుంటున్నారు. ఓ రకంగా ఆ తారక’రాముని’కి కొన్ని కోట్ల భక్త‘హనుమాన్’‌లు ఉన్నారు. అట్లాగే ‘తెలుగుజాతి’కి అసమాన సేవలందించిన ఇతర మహానీయులకీ అనేకంగా అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా రాజకీయాన్ని వ్యాపారంగా భావించే నాయకులు చేసే వికృత చేష్టలను, విపరీత పోకడలను ‘అసహనం’తో గమనిస్తూనే ఉన్నారు..

తమ పబ్బం గడుపుకోవడం కోసం మానవత్వాన్ని మరచిపోయిన అటువంటి రాజకీయ వ్యాపారులు.. కీర్తిశేషులైన కొందరి మహనీయుల పట్ల, వారి అలవాట్లు-జీవన విధానాల పట్ల, వారి స్మారక స్థూపాల పట్ల.. వాళ్ళు వాడే పదజాలం-భాషణలు, ఓ పధకం ప్రకారం తయారు చేయించి వైరల్‌ చేయిస్తున్న ఇంటర్వ్యూల సారాంశాలు-చాటింగ్‌‌లు-మీమ్‌లు-వీడియోలు.. ఇప్పటికే లక్షలాది అభిమానుల, అనుచరుల మనోభావాల్ని దెబ్బతీయడమేగాకుండా.. వాళ్ళ గుండెల్లో గునపాల్లా గుచ్చుకున్నాయి. వాళ్ళు ఆ గునపాలను అలాగే గుండెల్లోనే ఉంచేసుకుని, ఆ బాధని దిగమింగకుండా, అనుక్షణం తరచి తరచి గుర్తుచేసుకుంటూ మానసిక క్షోభని, చిత్రవధని అనుభవిస్తూ ‘అసహనాన్ని’ పెంచేసుకుంటున్నారు. ఉన్నపళంగా వాళ్ళకున్న అన్ని బంధాలు తెంచేసుకుని, అన్ని పనులు మానేసుకుని.. చేతికి ఏ వస్తువు దొరికితే దానినే మారణాయుధంగా మలచుకుని.. రాజకీయ వ్యాపారుల క్రీడలకు చరమగీతం పాడాలి అన్న ఆవేశకావేశాలకు లోనవుతున్నారు. అటువంటి కరుడుగట్టిన భావోద్వేగాలు ఎప్పుడు కట్టలు తెంచుకుని.. ఓ సునామీలా, ఓ అణు విస్ఫోటంలా సమాజ విధ్వంసానికి, వినాశనానికి దారి తీస్తాయో.. ఇప్పుడికిప్పుడు నిర్వచించలేం. సూక్ష్మంగా.. రాజకీయాన్ని వ్యాపారంగా భావించే నాయకులకి అర్ధం అయ్యే భాషలోనే చెప్పాలంటే “ప్రజల్ని గోవులు, గొర్రెలు అనుకుంటే గతులు మారిపోతాయి. ఆ గోవుల కొమ్ముల్లోంచి, ఆ గొర్రెల తోకల్లోంచి సభ్యసమాజపు విచ్ఛిన్నకర శక్తులు పుట్టుకొస్తాయి, జాగ్రత్త! ఖబడ్దార్‌!!”

త్వరగా జాగ్రత్త పడండి! జాగ్రత్త పడితే జన్మభూమి ఋణం తీర్చుకున్న వాళ్ళవుతారు!!

అసహనాన్ని తగ్గిద్దాం.. సంయమనం పాటిద్దాం..
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు..

In God We Trust NTR
వై. వి. ఎస్‌. చౌదరి.
(‘అన్న’ ఎన్‌. టి. ఆర్‌. వీరాభిమాని)
27.11.2020.