BIG BREAKING: కొత్త పార్టీపై వైఎస్ షర్మిల సంచలన ప్రకటన

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఇదే చర్చ. గత కొంతకాలంగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారంటూ మీడియాలో జోరుగా వార్తలు వస్తుండగా.. అవి అవాస్తవాలని కొంతమంది కొట్టిపారేశారు. వైసీపీ పార్టీ ఉండగా.. షర్మిల కొత్త పార్టీ ఎందుకు పెడతారంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు షర్మిల కొత్త పార్టీ గురించి వచ్చిన వార్తలు నిజమయ్యాయి.

sharmila new party announced

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు స్వయంగా వైఎస్ షర్మిల ఇవాళ వెల్లడించారు. ఇవాళ లోటస్‌పాండ్‌లో నల్గొండ జిల్లాకు చెందిన వైసీపీ మాజీ నాయకులు, వైఎస్ అభిమానులతో షర్మిల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొత్త పార్టీపై చర్చించిన అనంతరం కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యంను తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. తన కొత్త పార్టీ విషయంలో జగన్‌ను సంప్రదించలేదని, రాజకీయంగా తన దారి తనదే అని షర్మిల చెప్పారు. కానీ అన్నాచెల్లెళ్ల అనుబంధ అలాగే కొనసాగుతుందన్నారు. కేవలం తెలంగాణకు మాత్రమే తన పార్టీ పరిమితమవుతుందని, ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోమని షర్మిల తెలిపారు.

అయితే షర్మిల కొత్త పార్టీ వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీజేపీ బలపడుతున్న క్రమంలో.. ఓట్లను చీల్చి లబ్ధి పొందడానికి సీఎం కేసీఆర్‌నే జగన్‌తో చేతులు కలిపి షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక దీని వెనుక బీజేపీ హస్తం ఉందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక జగన్, షర్మిల మధ్య ఎప్పటినుంచో విబేధాలు ఉన్నాయని, అందువల్లనే షర్మిల వైసీపీ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టారని చెబుతున్నారు.

గత ఎన్నికల్లో కడప లోక్‌సభ సీటు ఇస్తానని షర్మిలకు జగన్ హామీ ఇచ్చారని, కానీ ఇవ్వకపోవడంతో షర్మిల అసంతృప్తితో ఉన్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి షర్మిలను మోసం చేశారని, అందుకే ఆమె కొత్త పార్టీ పెట్టారని మరికొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనా వీటిల్లో ఏది నిజమనేది భవిష్యత్తులో తేలనుంది.