ఒప్పేసుకున్నాం నటనలో నీ తర్వాతే ఎవరైనా

విశ్వ విశ్వ నాయక, రాజ్య రాజ్య పాలక, వేల వేల కోట్ల అగ్నిపర్వతాలు కలయిక… ఈ రెండు లిరిక్స్ వింటే చాలు ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమా అని టక్కున చెప్పేస్తారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్, తన తర్వాతి సినిమా యంగ్ డైరెక్టర్ బాబీకి ఇవ్వడంతో ఇండస్ట్రీ అంతా తారక్ కి ఏమయ్యింది? ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు, మళ్లీ ఫ్లాప్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని ఫ్యాన్స్ కూడా భయపడ్డారు… ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా కథని, బాబీని నమ్మిన ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా చేశాడు. అనౌన్స్మెంట్ టైములో అసలు అంచనాలు లేని ఈ మూవీ నుంచి ఫస్ట్ టీజర్ బయటకి వచ్చింది. ఎన్టీఆర్, రావణ అలియాస్ జైగా కనిపిస్తూ “ఆ రావణుడిని చంపాలంటే సముద్రం దాటాల, ఈ రావణుడిని సంపాలంటే సముద్రమంత ధైర్యం కావాల…” అని స్టామరింగ్ తో డైలాగ్ చెప్తుంటే, టీజర్ చూసిన ప్రతి ఎన్టీఆర్ అభిమాని “రేయ్, తారక్ అన్న ఎం యాక్టింగ్ చేసాడురా, ఇది కదా మనకి కావాల్సిన ఎమోషన్” అనుకున్నారు. ఈ ఒక్క టీజర్ కే అభిమానులు అంత ఎక్సయిట్ కావడానికి కారణం, టెంపర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలన్నీ ఒక మూడ్ లో ట్రావెల్ అయ్యేవి కావడమే. ఎన్టీఆర్ నుంచి సరైన కమర్షియల్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి దొరికిన సమాధానమే జై లవ కుశ.

ఈ జనరేషన్ లో చాలా మంది హీరోలు డబుల్ యాక్టింగ్ కే పరిమితమవుతుంటే, జై లవ కుశలో ట్రిపుల్ రోల్ ప్లే చేసి ఎన్టీఆర్ మెస్మరైజ్ చేశాడు. లవగా వినయంగా కనిపిస్తూ, కుశగా అల్లరి చేసిన ఎన్టీఆర్… రావణ్ మహారాజ్ గా స్క్రీన్ పై నట విశ్వరూపాన్నే సృష్టించాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తారక్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ యాక్టర్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు. ఎన్టీఆర్ నోటి వెంట ఘట్టమేదైనా పాత్రేదైనా నేను రెడీ అనే డైలాగ్ విన్న తర్వాత, అది నిజమేరా ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రనైనా చేసే సత్తా ఆయనకి ఉందిరా అనిపించేశాడు. క్రిటిక్స్ తో పాటు, ఆడియన్స్ ని కూడా మెప్పించిన జై లవ కుశ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. నెగటివ్ రోల్ లో ట్రెమండస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ ముందు ముందు ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్స్ అందుకున్నా జై పాత్ర మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది. మరో దశాబ్దం గడిచినా కానీ బెస్ట్ యాక్టర్ అనే లిస్ట్ తీస్తే అందులో ఎన్టీఆర్ పేరు తప్పకుండా అందరికన్నా ముందుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.