సూపర్ స్టార్ అయినా మెగాస్టార్ సలహా వింటాడా?

సైరా ప్రొమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తమిళ మ్యాగజైన్ అనంద వికటన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో స్టార్ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం గురించి చిరంజీవిని ప్రశ్నించగా వారు రాజకీయాల్లోకి రాకుంటే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువ ఉండదని, రాజకీయాలంటే కేవలం డబ్బు మాత్రమేనని స్పష్టం చేశారు. మంచి చేద్దామని వచ్చినా చేసే అవకాశం ఉండదని చిరు చెప్పుకొచ్చారు. అందుకు తనకు జరిగిన రాజకీయ అనుభవమే ఉదాహరణ అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నెంబర్ ఒన్ సినీ స్టార్‌ని కానీ ఎమి లాభం, సొంత నియోజకవర్గంలోనే పరాజయం పాలయ్యాననీ, ప్రత్యర్థులు తనను ఓడించడానికి కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టారని చిరు వివరించారు. పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పిన చిరు, కమల్ రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రాకపోవడమే బెటర్ అని సలహా ఇచ్చారు.

దీనిపై కమల్ స్పందిస్తూ తాను గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ప్రజల్లో మార్పు, చైతన్యం తీసుకువచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రజల ఆలోచనా ధోరణిపై తనకు అవగాహన పెరిగిందని కమల్ అన్నారు. రాజకీయాలకు సంబంధించి చిరంజీవి తనకు ఏనాడూ సలహాలు ఇవ్వలేదని చెప్పిన కమల్, మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి ఇటీవల తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టలేదు కానీ రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అభిమానుల సమక్షంలో ప్రకటించేశాడు. మరి తమిళనాట తిరుగులేని స్టార్ హోదా ఎంజాయ్ చేస్తున్న రజినీకాంత్ అయినా ఎన్నికల్లో నిలబడి గెలుస్తారా లేక కమల్ లాగే దెబ్బ తింటారా? ఈ రెండు కాదు తన స్నేహితుడు అనుభవంతో చెప్పాడు కదా అని రాజకీయాలకి రజినీ దూరంగా ఉంటాడా అనేది చూడాలి.